Sunday, April 1, 2012

విస్మృత యాత్రికుడు వెన్నెలకంటి 'కాశీయాత్ర'

తెలుగుయాత్రా సాహిత్యానికి వన్నె తెచ్చిన వైతాళికుడు 'కాశీయాత్రా చరిత్ర'(1838) రాసిన ఏనుగుల వీరాస్వామి. ఈయన యాత్ర జరిగింది 1830-31 సంవత్సరాల్లో. రెండవ వారైన కోలా శేషాచల కవి రాసిన పుస్తకం 'నీలగిరియాత్ర' (1854). ఆయన ఈ యాత్ర 1846- 47 సంవత్సరాల్లో చేశాడు. అయితే వీరాస్వామి కంటే ఏడు సంవత్సరాల ముందే కాశీయాత్ర (1822-23) చేసిన తెలుగు ప్రముఖుడు, ఒంగోలు వాస్తవ్యుడు వెన్నెలకంటి సుబ్బారావు.

వీరాస్వామి, శేషాచల కవి తమ యాత్రలను తెలుగులోనే రాశారు. కాని సుబ్బారావు తన యాత్రానుభవాల్ని విడిగా కాకుండా తన స్వీయచరిత్రతో పాటుగా రాసుకున్నాడు. 'A life journey of v.soob row' అనే స్వీయచరిత్రని, తాను కాశీయాత్ర చేసిన 16 సంవత్సరాల తరువాత, తన జీవితపు చివరి సంవత్సరంలో ఇంగ్లీషులో రాసుకున్నాడు. ముద్రించుకుందామని కూడా ఆలోచించలేదు. యాత్ర పూర్తవ్వగానే ముద్రించివుంటే సుబ్బారావే తెలుగుయాత్రా సాహిత్యానికి ఆద్యుడు అయ్యేవాడు. ఇంగ్లీషులో ఉన్న ఆ పుస్తకాన్ని ఆయన కొడుకు గోపాలరావు 1873 సంవత్సరంలో అంటే 34 సంవత్సరాల తరువాత ముద్రించి బంధువులకు పంచిపెట్టాడు.

అప్పటికే వీరాస్వామి 'కాశీయాత్ర' రెండవ ముద్రణకు కూడా వచ్చింది. అ తరువాత 103 సంవత్సరాలకు 1976 వ సంవత్సరంలో అక్కిరాజు రమాపతిరావు ఆ ఇంగ్లీషు గ్రంథాన్ని 'వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర' అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేయటం జరిగింది. తె లుగుపాఠకులకి ఆ పుస్తకం దొరకటం ఇప్పటికీ కష్టమే. అందుకే ఆయన చేసిన యాత్రల వివరాల్ని, బాటసారుల కోసం ఆయన నిర్మించిన సత్రం చరిత్రనీ, విషాదభరితమైన ఆయన జీవిత గా««థనీ తెలుగువారికి తెలియజెప్పటం యాత్రికుడుగా నా బాధ్యత అనుకున్నాను.

వెన్నెలకంటి సుబ్బారావు జన్మస్థలం ఒంగోలు పక్కనే ఉన్న ఓగూరు గ్రామం. ఒంగోలులోనే చదువుకున్నాడు. 13 సంవత్సరాల వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ(1757-1857)వారి మిలిటరీ ఆఫీసులో గుమస్తాగా చేరి అంచెలంచెలుగా ఎదిగి, మద్రాసులోని సదర్ అదాలత్ కోర్టులో ట్రాన్స్‌లేటర్, ఇంటర్ ప్రెటర్ ఉద్యోగాన్ని (1815-1829) ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించిన సుబ్బారావు బహుభాషావేత్త. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది.

జీవితాంతం మూత్రకోశసంబంధమైన వ్యాధితో నరకం అనుభవించినందువల్ల సుబ్బారావు తాను చేసిన సుదీర్ఘ యాత్రల గురించి రాయలేకపోయాడు. కోర్టు కాగితాల అనువాదంతోనే ఆయన కాలం అంతా హరించుకుపోతూ ఉండేది. అయినా చివరి రోజుల్లో 1839 సంవత్సరంలో ఎంతో ఓపికతో ఆత్మకథ రాయటం నాకు ఆనందాన్నిచ్చింది. తన బంధువు, తన తరువాత ఏడు సంవత్సరాలకు కాశీయాత్ర చేసి వీరాస్వామి రాసిన 'కాశీయాత్ర' 1838 వ సంవత్సరంలో ముద్రణ కావటమే ఆత్మకథా రచనకు ప్రేరణ అయివుంటుందని నా నమ్మకం. కాశీయాత్ర చేసిన మొదటి ఆ««ధునికుడుగా, ఇంగ్లీషులో ఆత్మకథని రాసుకున్న మొదటి తెలుగువాడిగా ఆ మహానుభావుణ్ణి గుర్తుంచుకోవాలి. రాజా రామ్‌మోహన్ రాయ్‌కీ, త్యాగరాజుకీ సమకాలికుడు సుబ్బారావు. ఐరోపాలో పారిశ్రామిక విప్లవం జరుగుతున్న రోజులవి. అప్పటికి కెమెరా రాలేదు. బ్రిటిష్ చిత్రకారులు వేసిన 'కంపెనీ పెయింటింగ్స్' ద్వారానే ఆనాటి భారతీయ సమాజాన్ని చూడగలం.

సుబ్బారావు జీవితంలో చాలా భాగం ప్రయాణాల్లోనే గడిచిపోయింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 55వ ఏట కన్నుమూసేవ రకూ, వివిధ సందర్భాల్లో ఆయన ప్రయాణాలు చేయవలసి వచ్చింది. ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం కొన్ని యాత్రలు చేస్తే భక్తికీ, బంధువులను పరామర్శించటానికీ చేసినవి మరికొన్ని.
1812 సంవత్సరం నాటికే ఆంధ్ర, కర్ణాటక అంతా తిరిగాడాయన ఉద్యోగరీత్యా. ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టగానే మరణం సమీపిస్తున్నట్లు ఊహించుకుని, 1822-23 సంవత్సరాల్లో మద్రాసు నుండి కాశీకి ప్రయాణం చేసి, 13 నెలల తరువాత క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నాడు. 1826వ సంవత్సరంలో రామేశ్వరానికి యాత్ర చేశాడు. కాశీనుండి తెచ్చిన గంగాజలంతో రామేశ్వరంలోని శివలింగాన్ని అభిషేకించటం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయాణంలో దక్షిణ భారతదేశ ంలో ఎక్కువ భాగాన్ని చూడగలుగుతాడు. ఇది మూడు నెలలపాటు జరిగిన సుదీర్ఘ యాత్ర. తన మూడవ భార్య కనకమ్మ మరణించాక, మనశ్శాంతి కోసం 1831వ సంవత్సరంలో కాళహస్తి, తిరుపతి పరిసరాల్లో పదిరోజులపాటు తిరిగాడు. 1832-33 సంవత్సరాల్లో 8 నెలలపాటు మరొకసారి దక్షిణభారతదేశంలో యాత్ర చేశాడు. చివరిగా 1837వ సంవత్సరంలో తెలిసిన మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకోవటానికి ఉత్తరాంధ్రజిల్లాల్లో పర్యటనలు చేశాడు.

1812వ సంవత్సరంలో ఆరోగ్యం దెబ్బతిని 'i was suuddenly taken ill with horrible pains in all parts of my body and to my utter astonishment i lost at one night the use of all my limbs'' ని రాసుకున్నాడు. అందువలన శ్రీరంగపట్నంలో ఉద్యోగం మానుకొని, నెల్లూరులో కలెక్టరుగా ఉంటున్న థామస్ ఫ్రేజర్ (1809-1823) ఆఫీసులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగంలో చేరి, అక్కడే కోటకు తూర్పు దిశలో స్థలం తీసుకుని 1815 నాటికి సొంత ఇల్లు కట్టుకొని కాలం గడిపాడు సుబ్బారావు. ఇంతలో మద్రాసులోని సదర్ అదాలత్ కోర్టువారికి సుబ్బారావు సేవలు అత్యంత అవసరం అయ్యేసరికి, ఫ్రేజర్ స్వయంగా ఆయన్ని మద్రాసుకి పంపాడు.

ఎంతో ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకి వెళుతున్నా, తన ఆరోగ్యం మాత్రం ఎంతమాత్ర మూ మెరుగుపడలేదు. 1829 నాటికి శక్తి పూర్తిగా సన్నగిల్లిపోగా, ఆ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం తప్పనిసరి అవుతుంది. అప్పటికే వివిధ హోదాల్లో కంపెనీవారికి 28 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు సుబ్బారావు. అనారోగ్యంతో సొంత ఇంటికి దూరంగా ఉద్యోగం చేసేకంటే, ఆరోగ్యంగా ఇంటిపట్టునే ఉంటే మరికొంత కాలం జీవించవచ్చు అనే నిర్ణయం తీసుకున్నాడు. 1829 జులె ౖనెలలో మైలాపూర్‌లోని తన తోట, ఇల్లు అమ్మేసుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి, రూ. 140 పెన్షన్‌తో నెల్లూరులోని తన సొంత ఇంటికి చేరుకున్నాడు.

సొంత ఇంట్లో స్థిరంగా ఉందామనుకున్న ఆశ కూడా తాత్కాలికమే అవుతుంది. ఎలాగంటే 1831లో తన మూడవభార్య కనకమ్మ ఒక మగబిడ్డని కని అనారోగ్యంతో మరణిస్తుంది. తనతో 15 సంవత్సరాలుగా కాపురం చేసిన భార్య మరణంతో సుబ్బారావు ఎంతో కుంగిపోయాడు. '..so great was my grief occassioned by the unexpected death of my poor wife kanaka that i was for sometime cofined to my bed at nellore'' అని రాశాడు. కన్న కొడుకునూ, అప్పటికే తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని పోషించటం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవటం తప్పనిసరి అవుతుంది సుబ్బారావుకి. తన రోగం రోజురోజుకీ ముదిరిపోతూనే ఉంటుంది. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి సహాయం చేసే మనస్తత్వం ఉన్న సుబ్బారావు అప్పటికే తన ఆస్తిలో ఎక్కువభాగాన్ని చుట్టపక్కాలకి పంచిపెట్టేశాడు. తనకు వారసుణ్ణి ప్రసాదించిన కనకమ్మ స్మృతికోసం పదిమందికీ ఉపయోగపడే పనిచేద్దాం అనుకున్నాడు. అప్పటినుంచి ఆయన మనసు తేలికవటం మొదలవుతుంది.

రద్దీగా ఉండే రహదారిలో బాటసారులకోసం సత్రాన్ని నిర్మించాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. ధర్మశాలలు, ముసాఫిర్ ఖానాల విలువ, ఉపయోగం ఒక యాత్రికుడిగా ఆయనకి బాగాతెలుసు. "..,u desire to built a choultry on some highway for the accomodation of travellers of all nations..'' అనే ఆలోచనతో నెల్లూరు జిల్లాలోని రామాయపట్నానికీ, సింగరాయకొండకూ మధ్య ఉన్న రహదారిలో kanaka's choultry ( కనకమ్మ సత్రం) కట్టడానికి స్థలాన్ని సేకరించగలిగాడు. బాటసారి దేవోభవ అని నమ్మిన సుబ్బారావు, సత్రం నిర్మాణం కోసం ఆరునెలలపాటు అక్కడే ఉండి, 1832 సంవత్సరం నాటికి ఆ నిర్మాణం పూర్తి చేయగలుగుతాడు. ఆ తరువాత సంవత్సరం విడుదలైన మద్రాసు గెజెట్‌లో సత్రం గురించిన వివరాలు ఉన్నాయి. సత్రం పని అంతా పూర్తయ్యాక ప్రజలు, బాటసారులు సుబ్బారావు పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో మెలిగారు. వారు చూపుతున్న గౌరవానికి, ప్రేమకు ఉప్పొంగిపోయిన సుబ్బారావు ఆ సత్రంలో తాను కూడా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. గాలిమార్పు కోసం దేశమంతా తిరిగినా, చివరికి తన సత్రం పరిసరాలే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాయి సుబ్బారావుకి.

అప్పటినుండి కుటుంబసమేతంగా సత్రంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని, వివిధ భాషలు మాట్లాడే యాత్రికులతో స్నేహం చేస్తూ, సముద్రతీర సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పంటపొలాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన 55 సంవత్సరాల జీవితాన్ని చాలా విపులంగా గుర్తుకి తెచ్చుకుని ఆత్మకథ రాశాడు. ఆ తర్వాత మరో రెండు నెలలపాటు మాత్రమే ఆయన బాటసారులకి కనిపించాడు.
1839 అక్టోబరు 1వ తేదీన ఆయన ఇహలోక యాత్ర చాలించగానే, కనకమ్మ సత్రం పక్కనే సుబ్బారావుని సమాధి చేశారనీ, చాలా కాలంపాటు ఈ సత్రం, సమాధులపట్ల ప్రజలు భయభక్తుల్ని కనపరుస్తూ వచ్చారని తెలుసుకుని ఎంతో ఆనందించాను. అనువాదంతో పాటు ఇలాంటి ముఖ్యమైన వివరాల్ని అందించిన రమాపతిరావుని మనుసులోనే అభినందించాను.

సుబ్బారావు లాంటి విస్మృతయాత్రికుడు, సహృదయుడు నిర్మించిన ఆ కనకమ్మ సత్రం ఒంగోలు పక్కన ఉన్న మా చవటపాలెం (వయా అమ్మనబ్రోలు) గ్రామానికి దగ్గరే కాబట్టి చూద్దామని బయలుదేరాను. ఇప్పటికి 180 సంవత్సరాల నాడు నిర్మించిన ఆ సత్రం ఎలాంటి శిథిలావస్థకి చేరుకుని ఉంటుందో అనుకుంటూ బయల్దేరాను. ఎందుకంటే ఒంగోలు స్టేషనుకి ఎదురుగా ఉండే పొత్తూరి అయ్యన్నశెట్టి సత్రం నాకు బాగా తెలుసు. ఒకటిన్నర ఎకరాల వైశాల్యంలో నిర్మించిన రెండు అంతస్థు«ల మేడ అది. 1909వ సంవత్సరంలో కట్టిన ఆ సత్రం శిథిలమైపోయి పది సంవత్సరాలైంది. అలాంటపుడు 180 సంవత్సరాల నాటి కనకమ్మ సత్రం ఎలాంటి దశలో నాకు దర్శనమిస్తుందో అనుకున్నాను.

- ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ 98498 83570

Sunday, July 10, 2011

నూటొక్క గుమ్మాల మేడ

'నూటొక్క జిల్లాల అందగాడు' అనడం విన్నారుగానీ, నూటొక్క గుమ్మాలున్న ఇల్లు గురించి విన్నారా ఎప్పుడైనా? నూటొక్క గుమ్మాలున్నాయంటే దాన్ని ఇల్లు అనాలా లేక, కోట అనాలా అన్న సందేహం వస్తుంది. కానీ అది కోట కాదు, అచ్చమైన అందాల పొదరిల్లు. విశాఖపట్నం నుంచి బయల్దేరి పచ్చపచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ యలమంచిలి దాటి గుడివాడ గ్రామానికి వెళితే అత్యద్భుతమైన సౌందర్యంతో అలరిస్తుంది ఆ నూటొక్క గుమ్మాల ఇల్లు...

ఊళ్లోకి అడుగుపెట్టక ముందే లేపాక్షి బసవన్న సైజులో రంగురంగుల బసవన్న ఠీవిగా ఉన్న శిల్పం స్వాగతిస్తుంది. ఆ దారిలో కాస్త దూరం సాగితే ఊహకందని అందంతో అకస్మాత్తుగా నూటొక్క గుమ్మాల ఇల్లు కనిపిస్తుంది. "ఈ ఇంటిని మా మావగారి తండ్రి పెద్దిరాజుగారు 1953లో కట్టించారండి. డబ్బులుంటే ఖర్చయిపోతాయి, అదే ఇల్లయితే ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆలోచించారట...'' అంటూ చెప్పుకొచ్చారు ఆ ఇంటి చిన్న కోడలు కృష్ణవేణి. ఆవిడ చెబుతున్న దాన్ని బట్టి ఆ ఇంటి నిర్మాణానికి ఏడాది సమయం పట్టింది. రోజుకు వంద మంది చొప్పున పనిచేశారు. "అప్పుడు చుట్టుపక్కల బాగా కరువుగా ఉండేదటండి.

ఎవరికీ పనుల్లేక అల్లాడిపోతుంటే మా మావగారు దీన్ని మొదలుపెట్టారని చెప్పుకోవడం విన్నాం. అందుకే రోజుకింతని కూలి డబ్బులు కాకుండా, పని చేసిన వారికి రెండు పూటలా భోజనాలు పెట్టేవారట ఆ రోజుల్లో. పెద్దాయన పద్ధతే వేరు. ఆయనకు పుణ్యకార్యాలంటే ఎంతో మక్కువ. మీకు తెలుసా..? మూడు తరాలుగా మా ఇంట్లో అందరూ శాకాహారులమే. మా పెళ్లి నాటికి ఇంటి నిర్మాణం పూర్తయింది. నూతన వధూవరులుగా మేమీ కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేశాం. మా తర్వాత బంధువుల పిల్లలవి, మా పిల్లలవీ అందరివీ పెళ్లిళ్లు ఈ ఇంట్లోనే అయ్యాయి. కళ్యాణ మండపాలని మేం బైటికి ఎక్కడికీ వెళ్లలేదు'' అని గుర్తు చేసుకున్నారు పెద్దకోడలు.

రంగుల హరివిల్లు...
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తులుగా ఉన్న ఈ ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చయిందని ఒక అంచనా. మొత్తం ముప్ఫై గదులు, పదిహేను హాళ్లు ఉన్నాయి. ప్రతి గదిలోనూ, వరండా మీదా మనకు నిలువెత్తు అద్దాలు కనిపిస్తాయి. హాళ్లన్నిటికీ నీలం రంగు, గదుల్లో ఎరుపు, లోపల వరండాలకు ఆకుపచ్చ రంగులో చేసిన గచ్చు వింత అందాన్నిస్తుంది. ప్రతి చోటా గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చేందుకు పెద్దపెద్ద కిటికీలతో పాటు పైకప్పులకు అద్దాలను ఏర్పాటు చేశారు. గుమ్మాలు, తలుపులు, ద్వారబంధాలు - అన్నీ బర్మా టేకుతో చేసినవే. ముఖద్వారంతో సహా గదుల తలుపులు, గుమ్మాలకు కనిపించే లతలు, రకరకాల డిజైన్లు ఆనాటి వడ్రంగుల హస్తకళా నైపుణ్యానికి సాక్షీభూతాలుగా కనిపిస్తాయి.

వెనకవైపు పెద్ద వంటిళ్లు, భోజనాల హాళ్లు, వాటిని ఆనుకునే తోట, అందులో బావి, వాటికి కాస్త పక్కగా పెంకులతో కట్టిన పశువుల కొట్టాలు, ఇంటిని ఆనుకునే కల్లం ఉంటుంది. అలాగే ఇంటి ముందు చల్లగా గాలి వీస్తూ, చక్కని నీడనిస్తూ కొబ్బరి తోట అలరిస్తుంది. 'సినిమా సెట్టింగులాగా ఉందీ ఇల్లు. షూటింగులేం జరగలేదా...' అనడిగితే "జరిగాయండీ, 'రెండురెళ్లు ఆరు' సినిమా షూటింగ్ కొంత చేశారిక్కడ. మాకా సినిమావాళ్ల హడావుడి, గోల పడలేదు. తర్వాత ఎవరొచ్చి అడిగినా మేం ఇవ్వలేదు. అప్పటివరకూ మా ముఖద్వారం ఎన్నడూ మూసి ఉండేదే కాదు. అలాంటిది ప్రచారం ఎక్కువయిపోయాక ఇంట్లో దొంగలు పడ్డారు.. దాంతో మేం జాగ్రత్త పడటం మొదలెట్టాం'' అంటూ చెప్పారు కృష్ణవేణి.

పండగొస్తే బాగుంటుంది...
మూడో తరంలోని మనవల్లో శ్రీపతిరాజు తప్ప ఇంకెవరూ అక్కడ ఉండటం లేదు. ఉద్యోగ, వ్యాపారాలు చదువుల్లో తలమునకలుగా ఉండి కొందరు విదేశాల్లోనూ మరికొందరు వివిధ ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. ఇప్పుడా ఇంట్లో ఉండేది నలుగురంటే నలుగురు పెద్దవాళ్లు. అయితే ఏడాదంతా ఎవరు ఎక్కడ ఉన్నా పంటల పండగ సంక్రాంతి నాటికి మాత్రం ఎక్కువమంది పూర్వీకుల ఇంటికి చేరుకుంటారు. "అందరూ వచ్చినప్పుడు చూడాలండీ సందడి. ఇంటికే కొత్త అందం వచ్చినట్టు, పండగంతా మా ఇంట్లోనే ఉన్నంత శోభగా ఉంటుంది'' అన్నారు శ్రీపతిరాజు. ఎప్పుడు ఏ మరమ్మత్తులు వచ్చినా వెంటనే చేయించి ఇంటిని జాగ్రత్తగా కాపాడుతున్నారాయన.

"ఎంత చేసినా చాలదు. ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర సమస్య వస్తూనే ఉంటుంది. ఒకప్పుడున్నన్ని పశువులు ఇప్పుడు లేవు. పైగా పెరటివైపు గోడ కాస్త పడిపోతోంది. పది మంది ఉన్నప్పటి దారి వేరు. అటు మనుషులు, ఇటు పాడిపంటలతో కళకళలాడిన ఇల్లు కదా, ఇప్పుడిలా చూడాలంటే కష్టంగానే ఉంటుంది...'' అన్నారు కృష్ణవేణి. ఇల్లు కట్టిన పెద్దిరాజుగారు లేరు, లేకలేక ఆయనకు కలిగిన కొడుకు లక్ష్మీపతిరాజు లేరు, ఆయన కొడుకులు అప్పలరాజు, పెద్దిరాజు కూడా లేరు. నూటొక్క గుమ్మాల ఇల్లు మాత్రం ఠీవిగా నిలబడి ఉంది - కాలం చెక్కిలి మీద తడి ఆరని ముద్దులా. ముద్దుగా.

పాలకులంతా మహిళలే...


గుడివాడ గ్రామానికి మరో విశేషమూ ఉంది. అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ మహిళలే! వార్డు సభ్యులు మొదలుకొని ప్రెసిడెంటు వరకూ మొత్తం పదిమందీ అతివలే. "ఎన్ని కులాలు, ఎన్ని ఆర్థిక తారతమ్యాలు ఉన్నా మేమంతా ఒకే మాట మీద ఉంటాం'' అన్నారు శ్రీపతిరాజు తల్లి కృష్ణవేణి. నూటొక్క గుమ్మాల ఇంటి చిన్న కోడలు. ఆవిడే గుడివాడ గ్రామ ప్రెసిడెంటు. ఆ ఐకమత్యం వల్లనేమో, ఊరు కూడా అభివృద్ధి ప«థంలో నడుస్తోంది.

నాబార్డు నిధులతో 29 లక్షల రూపాయలు ఖర్చు చేసి చక్కటి రోడ్డు వేసుకున్నారు. పాఠశాల, ఆసుపత్రి, బ్యాంకు వంటివన్నీ చక్కగా నడుస్తున్నాయి. బైర్రాజు ఫౌండేషన్ సాయంతో శుద్ధి చేసిన మంచినీరు అందరికీ అందుబాటులో ఉంది. యాభయ్యేళ్లుగా సర్పంచ్ పదవికి పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా సాగుతుండటం విశేషం. 
* అరుణ పప్పు, విశాఖపట్నం ఫోటోలు : వై. రామకృష్ణ

Friday, May 13, 2011

అటకెక్కిన తెలుగు వైభవం

తెలుగు సంస్కృతీ వైభవానికి ప్రతీకలుగా నిలిచే అద్భుత కళాఖండాలు, మన ఘన చరిత్రను దృశ్యమానం చేసే చిత్రాలు మూడున్నర దశాబ్దాలుగా మట్టికొట్టుకు పోతున్నాయి. రాజధాని నడిబొడ్డున ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలోని 'తరతరాల తెలుగుజాతి వైభవం' సంస్కృతి పట్ల మన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. తీవ్ర ఉపేక్షకు గురౌతున్న 'తెలుగువైభవం' గురించి.....
తెలుగువారంతా పదిలంగా కాపాడుకోవాల్సిన 'కళాసంపద' కాంతివిహీనం అవుతున్నది. తరతరాల తెలుగుజాతి వైభవం పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ప్రాంగణంలో మూడు అంతస్తుల్లో గల వేలాది కళాకృతులు, సంస్కృతి చిహ్నాలు పట్టించుకునేవారు లేక ఛిద్రం అవుతున్నాయి. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన కాలం నుంచి ఎందరెందరో మహానుభావులు శ్రమించి సేకరించి అపురూప కళాకృతులన్నీ దుమ్ము ధూళి కొట్టుకొని, శిథిలం అవుతున్నాయి.

ఇవన్నీ లక్షల రూపాయల విలువ ఉన్నవే కాదు, అపురూపమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అరుదైన చిత్రాలు, అద్భుతమైన శిల్పాలు ఉన్న తెలుగుజాతి వైభవ ప్రాంగణం అంతా దుమ్ముపట్టిపోయి బావురుమంటోంది. 1985లో నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయంలో భద్రంగా, ప్రతినిత్యం వేలవేల మంది సందర్శించి, ఆనందించేలా ఉండాల్సిన మ్యూజియం చూసే నాథుడే లేక వెలవెలబోతోంది. చిత్రకళా సంపదలో చరిత్ర, బొమ్మల కొలువు, మరపురాని మనీషులు పేరిట మూడు ప్రాంగణాలలో విశాలమైన భవంతిలో రూపకల్పన చేసిన ప్రదర్శనశాల దుస్థితిపై చూపుసారిస్తే చాలు తెలుగుదనంపై కాసింత మక్కువ ఉన్నవారి గుండెలు భగ్గుమంటాయి.

కళ్లముందు కదలాడే చరిత్ర

వర్తులాకారంగా ఉండే విశాలమైన తొలి అంతస్తులో మొట్టమొదటి చిత్రంతోటే చూపరుల మనసుపై మూడు వేల ఏళ్ళ నాటి తెలుగు పెద్దల చరిత్ర హత్తుకుపోతుంది. టిబెట్ మత గ్రంథాలలో దొరికిన ఒక చిత్రం ప్రతిరూపుతో ఇక్ష్వాకుల కాలంగా చెప్పుకునే రోజుల్లోని అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం అధినేత ఆచార్య నాగార్జునుడు అగుపిస్తాడు. ఆ తరువాత ద్రాక్షారామం, ఆ పక్కన అగస్త్యుడు, దాని చెంతనే పంచవటితో ప్రతి సందర్శకుడి ఆలోచనలు గత చరిత్రలోకి మళ్ళుతాయి.

ఆ వరుసలోనే బోధాయనుడు, హల చక్రవర్తి జలక్రీడలు, నాటి భాషా చమత్కారం చరిత్రను తట్టి లేపుతాయి. గుణాఢ్యుడు 7 లక్షల కథల్ని తన రక్తంతో రాశాడని అప్పటి రాజు రచయితపై కోపంతో తగులబెట్టించాడనే బృహత్కథ నుంచి చివరకు లక్ష కథలే మిగిలాని తెలిసి మనసు చివుక్కుమంటుంది. శ్రీశైలం, పల్నాటి నాగమ్మ, రామప్పగుడి, జాయప సేనాని, నెల్లూరు నుంచి ఓరుగల్లు వచ్చి కాకతీయ చక్రవర్తికి భారతం వినిపించిన తిక్కన, గోన గన్నారెడ్డిపై విజయం సాధించిన రుద్రమ, మోటుపల్లి ఓడరేవు మార్కోపోలోతో వ్యాపారం, హంపి, లకుమ, శ్రీనాథుడు, పోతన, వేమన, తానీషా, త్యాగయ్య, బొబ్బిలి మల్లమ్మ వంటి చారిత్రక వైభవ చిత్రాలు కాగితాలు, మాటలు అవసరం లేకుండానే తెలుగుదనాన్ని ఉప్పొంగిస్తాయి. డి.దొరైస్వామి, కనక సూరిబాబు, డి.ఎల్.ఎన్.రెడ్డి, కె.రాజయ్య, సయ్యద్ బీన్ మొహమ్మద్, పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె వాణి వంటివారు కళ్ళముందు నిలిపిన అద్భుత చిత్రాలు మన వైభవాన్ని చాటిచెబుతాయి.

మాట్లాడే బొమ్మలు

కలంకారి కళ, అమరావతి పాలకుడిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తెచ్చిన నాగార్జునసాగర్, ఆంధ్ర సిమెంట్ ఇతర పరిశ్రమలు- 1913లో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ, 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా నమూనా, బందరులో జాతీయ జెండా ఎగురవేస్తుంటే పోలీసులు లాఠీలతో చితకబాదినప్పుడు స్పృహ తప్పినా జెండా వదలని తోట నర్సయ్య, 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ - అండమాన్‌లో కఠిన జైలుశిక్షలో 48 రోజులు నిరాహారదీక్ష చేసిన ప్రతివాది భయంకరాచార్య వంటి వారి బొమ్మలు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల ఉదంతాల్ని కళ్ళముందుంచుతాయి.

గతంలోని మేనా, చిన్నరథం, వీణలు, శిల్పాలు వంటివి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కథలు కథలుగా మన ముందు పరుస్తాయి. వీటన్నింటినీ చూస్తూ.... మన తెలుగు వైభవాన్ని మరింత ఆస్వాదిద్దాం అనుకొనే వారికి విశ్వవిద్యాలయం కల్పించిన అడ్డంకులతో ఆశాభంగం కలుగుతుంది. పై రెండు అంతస్తుల్లో 2200కి పైగా కళాఖండాలు ఉన్నాయిని చెబుతారు కానీ, వాటిని చూసేందుకు సందర్శకులకు అవకాశం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తుంది.

ఉపేక్షకు దర్పణం

1975లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ మహాసభల్లో తెలుగు జాతి సంస్కృతి ప్రదర్శన కోసం అపురూపమైన వస్తువుల సేకరణ జరిగింది. వాటన్నింటిని చూసి లక్షలాది మంది పరవశించారు. శభాష్ అన్నారు. 'లలితకళాసమితి', తెలుగు భాషాసమితి' వంటి వారు ఆ రోజుల్లో లక్షలు లక్షలు ఖర్చుపెట్టి 2600 పైచిలుకు కళాకృతుల్ని సేకరించారు. అకాడమీల రద్దుతో యూనివర్సిటీకి బాధ్యతలు ఒప్పగించారు. వాటన్నింటిని నాటి పెద్దలు కొండంత ఆశతో విశ్వవిద్యాలయానికి వారసత్వ కానుకగా ఇచ్చారు. అపారమైన విలువగల ఆ కళాసంపద గురించి తగ మూడున్నర దశాబ్దాలుగా దృష్టిపెట్టిన వారే లేదు.

కోట్ల రూపాయల విలువ వుంటుందని గొప్పగా చెప్పుకునే ఎం.ఎఫ్.హుసేన్ వంటివారి పెయింటింగ్‌తో సహా వేలవేల చిత్రాలు యూనివర్సిటీ పరం అయ్యాయి. అప్పటి వి.సి. మనసుపెట్టి తమ గదిలో అలంకరించుకున్న చిత్రాలు మాత్రం కళ తప్పకుండా అందరి కళ్లముందున్నాయి. మ్యూజియంలో మూటలు మూటలుగా, అంగుళాల మందంతో దుమ్ము పేరుకుపోయిన తెలుగు సంస్కృతీ సంపద మన ఉపేక్షకు నిలువుటద్దంగా పడివున్నది. వాటి విలువ తెలిసిన సిబ్బంది ఎంత మొత్తుకున్నా, అంతులేని నిధుల కొరతతో అవన్నీ అటకమీద మిగిలిపోయాయి. పాతతరం ఉద్యోగులు రిటైర్ కావడంతో కొత్తతరం వారికి వాటి గొప్పతనం తెలియక, ఆ మూటల్లో ఆసలు ఏముందో కూడా తెలియకుండా పోయింది.

దీంతో మేటి చిత్రకారులు, వారి చిత్తరువులు ఆలనా పాలనా లేకుండా కళావిహీనం అయిపోతున్నాయి. సంబంధిత రికార్డులు, వాటి వివరాలు తెలిసిన వారు ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధం లేకుండా దూరం అయిపోయారు. చాలామంది కాలం చేయడంతో ఏం జరుగుతుందో, ఎలా పరిరక్షించుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. కొద్దిమంది పట్టు విడవకుండా పెద్దల వెంటబడితే కష్టంగా కాసిని నిధులు కేటాయిస్తే అపురూప చిత్రాలు, కళాఖండాలు రాక్‌లలోకి ఎక్కాయి. అయితే ఇప్పుడవి మొత్తంగా బూజు, ధూళితో దులపటం కూడా కష్టం అనిపించేటంతగా అట్టలుకట్టిపోయాయి.

అద్భుతాలు చేసే వీలున్నా..

ఈ దుస్థితిపై పలకరిస్తే ఏం చేయమంటారన్నట్లుగా ఉంది అధికారుల సమాధానం. తమ ప్రతిపాదనలు, సూచనల్ని ఆలకించేవారు కూడా లేకుండా పోయారన్న ఆక్రోశం అందరిలో పొంగుతోంది. ఇతర మ్యూజియాలకు దీటుగా, పోటాపోటీగా చేయగల సత్తా ఉన్నా ప్రోత్సాహం లేదని వాపోతున్నారు. నగర శివార్లలోని బాచుపల్లికి యూనివర్సిటీ క్యాంపస్ తరలి వెళ్తే, నాంపల్లిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని అద్భుతమైన తెలుగు కళా ప్రదర్శనశాలగా తీర్చిదిద్దుతాం అంటున్నారు అధికారులు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహణలో గల చిత్రమయిలో మూడు అంతస్తుల విశాల ప్రాంగణంలో బోలెడంత జాగా అందుబాటులో ఉందిగా అంటూ కొందరు కళాభిమానులు దారి చూపిస్తున్నారు. పర్యాటక శాఖ, ఇతర సంస్థలు నిర్వహించే నగర సందర్శన స్థలాల్లో ఈ ప్రాంగణాన్ని కూడా చేర్చి ప్రోత్సహిస్తే అపార ఆదరణతోపాటు, ఆదాయం కూడా పొందే అవకాశాలున్నాయి. వనరుల కన్నా మంచి సంకల్పం, చిత్తశుద్ధి వుంటే భావి తరాలకు మన తెలుగుదనం వారసత్వాన్ని ఉత్తేజమయంగా అందించవచ్చని సాంస్కృతిక రంగ అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.

Saturday, April 16, 2011

అబ్బక్క మహారాణి వెలుగు చూడని వీరనారి

veeranarimani16వ శతాబ్దంలో విదేశీయులపై అలుపెరగని పోరాటం చేసి వాళ్లను చీల్చి చెండాడిన వీర నారి అబ్బక్క రాణి. అయితే ఆమె వీరోచిత చరిత్ర గురించి మన వాళ్ళుగాక ఒక విదేశీ యుడు చెప్పడం గమనార్హం.విజయనగర సామ్రాజ్యం గురించి రాబర్ట్‌ సేవెల్‌ రాసిన ‘ఫర్గాటెన్‌ ఎంపైర్‌’ పుస ్తకం ద్వారా మనకు చారిత్రక వాస్తవాలు ఎన్నో తెలిశాయి. ఆ పుస్తకం రాయడానికి ఆయ నకు విదేశీ యాత్రికులు ఆ సామ్రా జ్యాన్ని సందర్శించిన ‘డొమింగో పైస్‌’ , ‘ఫెర్నో నూనిజ్‌’ రాత ప్ర తులే ఆధారమయ్యాయి. ఆ తరువాత మన వాళ్లు ఎన్నో పరిశోధనలు చేసి కొత్త విష యాలు కనుక్కున్నారు. కానీ ఆ సామ్రాజ్యం గురించి ప్రపంచానికి మొదట తెలియ జేసింది మాత్రం సేవెల్‌.

తుళునాడు ప్రాంతంలో విదేశీయులను గడ గడ లాడించిన వీర వనిత అయిన అబ్బక్క రా ణి గురించి ఆ ప్రాంతంలో ఇప్పటికీ జానప దులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఆమెను ప్రత్యక్షంగా చూసి ఆమె ఆతిధ్యం స్వీకరించి, ఆమె సాహసం ఎలాంటి దో తెలుసుకున్న ఇటలీ యాత్రికుడు పిట్రో డెల్లా వల్లే. ఆయన భారత దేశంలో 1621- 24 మధ్యన పర్యటించాడు. తన యాత్రా వి శేషాలలో ప్రత్యేకించి అబ్బక్క రాణి గురించి ఎన్నో విషయాలను వెల్లడించాడు.

పిట్రో భారత దేశం రావడానికి ముందు పర్షి యా చక్రవర్తి షా అబ్బాస్‌ను సందర్శించాడు. ఆయన ఆతిధ్యం స్వీకరించాడు. అప్పుడు త్వరలో భారత దేశం వెడుతున్నట్టు పిట్రో చెప్పాడు. అలా వెడితే నువ్వు తప్పకుండా ఉల్లాల్‌ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అబ్బక్క రాణ ిని కలుసుకో. ఆమె సాహసాల గురించి చాలా విన్నాం. ఆమెను చూడాలనిపిస్తోంది. మాకా అవకాశం లేదు. నువ్వు స్వయంగా ఆమెను కలిసి మాట్లాడు అని అబ్బాస్‌ చెప్పినట్టు పిట్రో రికార్డు చేశాడు.

veeranarisదీనికి ముందు భారత దేశ స్థితి గురించి తెలు సుకుందాం. 1336లో ప్రారంభమైన విజయ నగర సామ్రాజ్యం 1565లో జరిగిన తళ్లికోట యుద్దంలో చెల్లా చెదరై పోయింది. ఆ పాలకు లు రాజధాని హంపీ నగరం వదిలి పెనుగొం డకు తరలిపోయారు. అఖండ సామ్రాజ్యం గా వెలిగిన విజయనగరం విచ్ఛిన్నం కావడం తో సామంత రాజులు స్వతంత్ర రాజులైపో యారు. చిన్న రాజ్యాలు బల పడసాగాయి. చిన్న రాజ్యాలను ఒక త్రాటి మీదకు తీసుక వచ్చి తుళునాడు కేంద్రంగా బలమైన నాయ కుడుగా ఎదుగుతున్నాడు కేలాడిని పాలిస్తున్న వెంకటప్ప నాయకుడు. విజయ నగర రాజులకు మంగుళూరు, భత్క ల్‌, హోనవర్‌ మొదలైన ఓడరేవులు చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ఓడరేవుల ద్వారా అరే బియా, పర్షియా దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకొనేవారు. మన వస్తువులను ఎగుమతి చేస్తుండేవారు.

1498 మే 17వ తేదిన పోర్చుగీస్‌ యాత్రికుడు వాస్కోడగామ కాలి కట్‌ ఓడ రేవు ద్వారా భారత దేశంలోకి ప్రవే శించాడు. ఆయన తిరిగి వెడుతూ భారత్‌ నుంచి కొన్ని సరుకులు తీసుకెళ్లి వారి దేశం లో అధిక ధరలకు విక్రయించి బాగా డబ్బు చేసుకున్నాడు. దీనితో పోర్చుగీస్‌ వారి దృష్టి మన దేశం మీద పడింది.
1503వ సంవత్సరంలో అల్ఫొన్సో డే అల్బు కర్క్‌ భారత దేశం వచ్చారు. గోవాను వారి స్ధావరంగా చేసుకున్నారు.1509వ సంవత్స రంలో ఆయన గోవా గవర్నరుగా నియమి తులయ్యారు.

అదే సంవత్సరం విజయ నగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరయలు సింహాసనాన్ని అధిరోహించాడు. గోవా అప్పుడు బీజాపూర్‌ సుల్తాన్‌ ఆదిల్‌ షా పరిపా లనలో ఉంది. దీనిపై ఆధిపత్యం సాధించ డా నికి 1510వ సంవత్సరంలో సుల్తాన్‌పై అల్ఫొ న్సో యుద్దం ప్రకటించాడు. అయితే ఆ యు ద్ధంలో పోర్చుగీస్‌ వారు పరాజయం పాల య్యారు. ఫిబ్రవరి 17న అల్ఫొన్సో గోవా వదిలి పారిపోయాడు.

తరువాత బీజాపూర్‌ సుల్తాన్‌ మరణించాడు. పసివాడైన అతని కుమారుడు ఇస్మాయిల్‌ ఆదిల్‌ షారాజు అయ్యాడు. ఇదే సరైన అదు నుగా భావించిన అల్ఫొన్సో స్ధానిక హిందూ నాయకుడు తిమోజ సహాయంతో గోవాను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుంచి భారత దేశంలో పోర్చుగీస్‌ వారికి గోవా ము ఖ్యమైన ఓడ రేవు పట్టణమైంది. అప్పుడు దేశంలో సాంఘిక దురాచారం సతీ సహగ మనం ఎక్కు వగా ఉంది. మహిళలు ఇలా అగ్నికి ఆహుతి కావడం అమానుషమని దీని ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అల్ఫొన్సో. అయితే అది అమలు కాలేదు.

పోర్చు గీస్‌ వారు గోవాలో కోట కట్టుకోవడా నికి కృష్ణదేవరాయలు అనుమతిచ్చారు. అం దుకు ప్రతిఫలంగా యుద్ధ గుర్రాలను సరఫ రా చేయడానికి వారు అంగీకరించారు. భార త దేశంలో పోర్చుగీస్‌ వారు ముస్లిమ్‌ పాలకు లను శత్రువులుగా హిందూ రాజులను మిత్రు లుగా చూశారు. వీరు స్ధిరపడటానికి, వారి వ్యాపారాన్ని విసృ్తతం చేసుకోవడానికి ప్రధాన కారకులు విజయనగర రాజులే.
పోర్చుగీస్‌, స్పెయిన్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులవి. అన్నిచోట్లా వారి గుత్తాధిపత్యం సాగిపోతోంది.

మొదటి నుంచి అరబ్‌ దేశాలు భారత దేశంలోని అనేక రాజ్యాలతో వర్తక సంబంధాలు కలిగి ఉన్నాయి. అరబ్‌ దేశాల ను దెబ్బ కొట్టడానికి స్పెయిన్‌, పోర్చుగీస్‌ దేశా లు చేతులు కలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లాల్‌ మహారాణి అయిన అబ్బక్క పోర్చు గీస్‌ వారిని చిత్తుగా ఓడించింది. ఒకసారి కా దు రెండు సార్లు కాదు అనేక పర్యాయాలు ఉల్లాల్‌ రేవును స్వంతం చేసుకోవాలని చూసి నప్పుడల్లా అబ్బక్క వారి సైన్యాలను చావుదెెబ్బ తీసింది. అందుకే అటు అరబ్‌ ఇటు పర్షియా దేశాలలో అబ్బక్క పేరు మారుమ్రోగిపోయిం ది. అంతటి తెగువ, సాహసం ఉన్న వీరనారి అబ్బక్క మాత్రమేనని వారి విశ్వసించారు.

తుళునాడును పరిపాలించిన చౌత సామ్రాజ్య వారసురాలు అబ్బక్క. చిన్నప్పుడే ఆమెలోని ప్రతిభను చూసి తండ్రి ప్రోత్సహించాడు. మేనమామ తిరుమల రాయలు శిష్యరికంలో విలువిద్య, కర్రసాము, కత్తివిద్యలో ఆరితేరి పోయింది. గుర్రాన్ని అధిరోహించి యుద్ధం చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోయే వి కావట. రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేయడం చిన్న వయసులోనే నేర్చుకుంది.సంప్రదాయం ప్రకారం ఉల్లాల్‌ రాజ్యానికి మహారాణి అయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకే సమీపంలోని వంగ రాకుమారుడు లక్కప్ప అరసతో ఆమె వివాహం జరిగింది. లక్కప్ప అరస పోర్చుగ్రీసు వారికి అనుకూలంగా ఉం డేవాడు. వారిచ్చే ఖరీదైైన బహుమతులు స్వీ రిస్తూ, వారితో పాటు విందు వినోదాలలో ము నిగిపోతుండేవాడు. తమ రైతులు పండించి న పంటలను అతి తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు విదేశాలలో అమ్ముతూ ఉం డటం, తమ ఓడ రేవులను స్వాధీనం చేసు కుంటున్నారన్న అభిప్రాయంతో ఉన్న అబ్బక్క కు భర్త ప్రవర్తన నచ్చలేదు.

ప్రజలను దోచుకుంటున్న పోర్చుగీస్‌ ముష్క రులను మట్టు పెట్టాలే తప్ప మర్యాదలు చెయ్యకూడదని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరికీ ఘర్షణ జరిగింది. అబ్బక్క తన పిల్లల ను తీసుకొని తిరిగి ఉల్లాల్‌కు వచ్చేసింది. లక్కప్ప అరస, మూలరాజు కుమార్తె తంకరా దేవిని వివాహం చేసుకున్నాడు. అబ్బక్కపై ప్రతీకారంతీర్చుకోవాలనుకున్నాడు. అందుకు పోర్చుగీస్‌వారి సహాయం కోరాడు. వారు కూడా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నారు.

అబ్బక్క కేలాడి, కాలికట్‌ రాజ్యాలతో సత్సం బంధాలు పెట్టుకుంది. వారి ప్రోత్సాహంతో మధ్య తూర్పు దేశాలకు సరుకులను తమ ఓడ రేవు ద్వారా స్వయంగా ఎగుమతి చేసిం ది. అవకాశం కోసం చూస్తున్న పోర్చుగీస్‌ వారు సముద్రం మధ్యలో నౌకలను పట్టుకు న్నారు. ఇది తెలుసుకున్న అబ్బక్క ఉగ్రురాలై మంగుళూరులో ఉన్న పోర్చుగీస్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. అడ్డం వచ్చిన సైనికులను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది.

పోర్చుగీస్‌ వారు ఉల్లాల్‌ ఓడ రేవును స్వాధీ నం చేసుకొని ఆపైన కోట ముట్టడించడానికి తగిన ప్రణాళిక రచించారు. దీనికి అబ్బక్క మాజీ భర్త లక్కప్ప అరస కూడా తోడయ్యాడు. అదే సమయంలో అబ్బక్కకు సహకారా న్ని అందించే కేలాడి రాజు వెంకటప్ప నాయ కుడు1618వ సంవత్సరంలో వంగ రాజ్యన్ని జయించి మంగుళూరు వైపు వస్తున్నాడు. ఉల్లాల్‌ను ముట్టడించడానికి ఇదే సరైన సమ యమని పోర్చుగీస్‌ వారు భావించారు. ముం దుగా యుద్ధ నౌకలలో సైన్యాన్ని ఉల్లాల్‌ ఓడ రేవులో మోహరించారు.
అమావాస్య రాత్రి. కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ కాళరాత్రిలో ఆత్మత్యాగానికి సిద్ధ పడే జాలర్లకు, గజ ఈతగాళ్లకు అబ్బక్క కర్తవ్యాన్ని ఉధ్బోదించింది. ఆమె ఆదేశానుసా రం నాటు పడవల్లో సముద్రంలోకి వెళ్లి, పోర్చుగీస్‌ వారు మోహరించిన ప్రాంతానికి నాలుగు వైపుల నుంచి ముట్టడించారు.

పోర్చుగీస్‌ యుద్ధ నౌకలపై మండుతున్న ఎండు కొబ్బరి కాయలను ఒక్కసారిగా నాలు గు వైపుల నుంచి విసిరి వేశారు. మండుతు న్న కొబ్బరి కాయలు వచ్చి పడుతుంటే పోర్చు గీస్‌ సైనికులు ప్రాణ భయంతో చావు కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు యుద్ద నౌకలకు అంటుకున్నాయి. మంటల్లో చిక్కు కొన్న సైని కులు హాహా కారాలు చేస్తూ ప్రాణాలను రక్షిం చుకోవడానికి నీళ్లలోకి దూకి ఈదుకుం టూ ఒడ్డుకు చేరారు. అదను కోసం చూస్తున్న అబ్బక్క సైనికులు వచ్చిన వాడిని వచ్చినట్టు హతమార్చారు. అలా 200 మంది సైనికులు మరణించినట్టు రికార్డుల వల్ల తెలుస్తోంది.

ఇలాంటి సాహసవంతురాలైన వీరవనితను తలుచుకుంటూ పిట్రో మంగుళూరుకు వచ్చి అక్కడ నుంచి ఉల్లాల్‌కు ప్రయాణమయ్యా డు. అతనికి దారి చూపించడానికి స్ధానిక భాషను తర్జుమా చేసి చెప్పడానికి ఒక అనువాదకుని కూడా వెంట తెచ్చుకున్నాడు. వారు ఉల్లాల్‌కు చేరుకునేసరికి రాణి మనేల్‌ అనే గ్రామానికి వెళ్లిందని, అక్కడ వ్యవసా యానికి కావలసిన నీటిని కాలువల ద్వారా మళ్లించడానికి ఏర్పా ట్లు జరుగుతుంటే వాటిని పర్యవేక్షించడా నికి వెళ్లారని కోటలోని వారు తెలిపారు. అప్పటికే ఆమె అక్కడ నుంచి తిరిగి వస్తున్నారు.

ఆమె చుట్టూ 10 మంది వరకు సాయుధులైన సైని కులు తుపాకులతో రక్షణగా ఉన్నారు. స్ధానికులు ఆమెకు నమస్కరిస్తుంటే ఆమె అభివాదం చేస్తూ ముందుకు కదు లుతున్నారు. చామనఛాయ, మామూలు ఎత్తు. కాటన్‌ చీర ధరించింది. మరొక చీర తలపై నుంచి భుజాల వరకు కప్పు కుంది. చెప్పుల్లేకుండా నడుస్తుంటే ఆమెకు ఎండ తగలకుండా వ్యక్షిగత సహా యకుడు తాటి ఆకుల గొడుగు పట్టాడు. ఆ గుంపుతో పాటు పిట్రో కూడా నడు స్తూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఒక గృహిణి లాగా ఉందే తప్ప ఒక రాజ్యానికి రాణిలా అనిపించలేదు. అంత సాధారణంగా ఉంది. అప్పుడు పిట్రో వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అత ని భాష తెలిసిన వారు ఎ వరైనా ఉన్నారా? అని అబ్బక్క రాణి జనం వై పు చూసింది. అ ప్పుడు అనువాదకుడు ముం దుకొచ్చాడు. ముందుగా తాను పోర్చుగీస్‌ వాడిని కాదని ఇటలీ నుంచి వచ్చానని చెప్పాడు. తాను పర్షి యన్‌ చక్రవర్తి, మొఘల్‌ చక్రవర్తి మొదలైన వారిని సందర్శించి వచ్చా నని చెప్పాడు.అప్పుడు అబ్బక్క అంత మంది గొప్ప చక్రవర్తు లను సందర్శించిన మీరు నన్ను చూడటానికి రావడం ఆశ్చర్యంగా ఉందే? అని అడిగింది.

మీరు మా దేశాలలో చాలా ప్రసిద్ధి. మీ సా హసం, మీ తెగువు, పోర్చుగీస్‌ వారితో రాజీ లేని మీ పోరాట పటిమ కథలుగా చెప్పుకుం టున్నారు. అందుకే మిమ్మల్ని చూడటానికి ప్రత్యేకించి ఉల్లాల్‌కు వచ్చాను. మీరింత సా దాసీదా ఉంటారని మాత్రం నేను ఊహించ లేదు అని చెప్పాడు పిట్రో. ఆ తరువాత అత నికి కోటలో ఆతిధ్యం ఇచ్చి ఎంతో ఆప్యా యంగా చూసింది అబ్బక్క. దేశం కాని దేశం లో ఆమె చూపించిన అభిమానం, ఆదరణ తన తల్లిని జ్ఞప్తికి తీసుక వచ్చాయని, ఆమెను చూస్తుంటే ఒక దేవతను చూస్తున్నంత ఆరా ధనా భావం కలిగిందని పిట్రో తన యాత్రా విశేషాలలో పేర్కొన్నాడు.

పిట్రో భారత దేశం వదలి వెళ్లిన సంవత్సరా నికి 1625లో బీజాపూర్‌, అహ్మద్‌ నగర్‌, కా లికట్‌ వారితో కలసి అబ్బక్క రాణి, పోర్చు గీస్‌ వారిపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకూ మంగుళూరు కోట పోర్చుగీస్‌ వారి ఆధీనంలో వుంది. ఆ కోటను ముందుగా నాశనం చేశా రు. పోర్చుగీస్‌ సేనలను చిత్తుగా ఓ డించారు. విజయంతో తిరిగి వస్తుండగా సేనలకు నాయ కత్వం వహించిన కుట్టి పోకర్‌ ను పోర్చుగీస్‌ సైనికులు దొంగ దెబ్బ తీసి చం పేశారు. ఎప్పు డైతే కుట్టి పోకర్‌ చనిపోయాడో సంకీర్ణ సేనలు చెల్లాచెదురయ్యాయి.


పోర్చుగీస్‌ సైనికులు మళ్ళీ విజృంభించి ఉలాలల్‌ రాజ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. అబ్బక్క రాణిని బందీగా పట్టుకుని కారాగారంలో వేశారు. నాలుగు దశాబ్ద్దాలుగా తమను ము ప్పతిప్పలు పెట్టిన అబ్బక్కను చిత్రహింసలు పె ట్టి చంపాలనుకున్నారు. అయితే ఆమె కారా గారంలో ఆడపులిలా విజృంభించి పోర్చు గీస్‌ సైనికులను చంపేసింది. నాలుగు వైపుల నుం చి సాయుధులైన సైనికులు ఒక్కసారిగా దాడి చేసి అతి క్రూరంగా చంపేశారు. ఇంతటి వీర నారి, అనితర సాధ్యమైన వ్యూహ కర్త, రాజనీ తిజ్ఞురాలు, పరిపాలనా దక్షురాలు, పోరాట యోధురాలు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. నిజానికి అబ్బక్క కేవలం ఉల్లాల్‌కే పరిమితమైన మహిళకాదు. భారతీయ మహిళా లోకానికే గర్వ కారణం.మాతృగడ్డ కోసం ఆమె చేసిన పోరాటం, ప్రజ ల కోసమే బ్రతికిన ఆమె జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. 


bhagiratha

Saturday, November 20, 2010

అమరశిల్పి జక్కన

Kasivisvesvara
జక్కనాచారి అమరశిల్పిగా పేరుప్రఖ్యాతులు గావించారు. క్రీ.శ. 12వ శతాబ్దంలో కర్నాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్నాటక రాష్ట్రం, హసన్‌ జిల్లా బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం.

జీవితచరిత్ర: జక్కనాచారి కర్ణాటకలోని తుముకూరు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. ఆయన జీవితం అంతా కళలకు అంకితం చేసిన ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతికాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను,తన కుటుంబాన్ని సైతం మరిచిపోయాడు.

jakkana1
కాగా జక్కనాచారికి ఒకే ఒక్క మగబిడ్డ. అతడే ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం వెళతాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని గుర్తిస్తారు. ఢక్కన తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.

చెన్నకేశవ ఆలయం, బేలూరు: అనంతరం జక్కనాచారికి క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. అది పూర్తయిన తరువాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ సంఘటన ప్రకారం, క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో ’కై’ అనగా చేయి అని అర్థం. జక్కనాచారి అవార్డులు: ఇంతటి ప్రసిద్ధిచెందిన కళాకారుని జ్ఞాపకార్ధం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు, కళాకారులకు జక్కనాచారి పేరిట అవార్డులు ప్రదానం చేయడం విశేషం. 1964 సంవత్సరంలో డా.అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన అమరశిల్పి జక్కన విడుదలై అఖండ విజయం సాధించడం విశేషం.

Monday, November 15, 2010

కబాబులు తిని వదిలేశారు

మన రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలలో చెన్నమనేని రాజేశ్వరరావు ఒకరు. నిజాం కాలంలో జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరపున పోరాడిన యోధుడిగా ఆయన జ్ఞాపకాలు ఈ తరం వారికి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాజేశ్వరరావు తన అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి అందించిన ఆత్మకథే 'సత్యశోధన'. 
ఇటీవలే విడుదలైన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు -
 
కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఉంటున్న రోజుల్లో హైదరాబాద్‌లో నన్ను అరెస్టు చేయడానికి ప్రత్యేక నిఘా విభాగం పని చేసింది. నేను చిక్కడపల్లి దేవాలయం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నాను. నాతో పాటు మా అమ్మ, నా భార్య లలిత, మా పాప అరుణ, నా సోదరుడు హనుమంతరావులు ఉండేవారు.

నిండు జనారణ్యంలోనే అయినప్పటికీ అది మా రహస్య స్థావరం. ఈ స్థావరాన్ని కాపలాకాస్తూ, మా అన్ని అవసరాల్ని తీర్చే బాధ్యతను నా మిత్రుడు శ్రీ ఎన్. ధర్మారావుగారు చూస్తుండేవారు. ఇతడు ఎల్.ఐ.సి అధికారిగా ఉండేవాడు. ఇక్కడ నా జీవితపు దినచర్య చాలా పకడ్బందీగా ఉండేది. రాత్రుళ్ళు నారాయణగూడాలో ఉన్న ధర్మారావుగారి ఇంటిలో గడుపుతూ, తెల్లవారకమునుపే సైకిల్‌పై చిక్కడపల్లి స్థావరం చేరుకుని పగళ్ళు గడిపేవాడిని. ఎలాగోలా పోలీసులు నా స్థావరం ఆచూకీ పసిగట్టేసారు. ఇంకేముంది? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను అరెస్టు చేసేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి ముందు, ఇంటి చుట్టూ, సాయుధ పోలీసులు కాపలా కాస్తున్నారు.

గుర్తుపట్టకపోవడంతో....

ఇదేమీ తెలియని నేను యథాప్రకారం తెల్లవారుఝాము 5 గంటల వేళ సైకిల్‌పై నా స్థావరానికి వెళ్ళేదారిని చేరాను. అక్కడ ఒక పోలీసు నా సైకిల్‌ని ఆపి, సైకిల్ హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకుని, ఉర్దూబాషలో "ఈ రోజు సి.హెచ్. రాజేశ్వరరావుని అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆయన స్థావరం చుట్టూ గట్టి కాపలా పెట్టాం. కాబట్టి చిక్కడపల్లి నుండి మనిషి ఎవరూ బయటకు వెళ్ళరాదు. బయటి నుండి కూడా లోపలికి ఎవ్వరూ పోవడానికి వీలులేదు'' అన్నాడు.

అప్పటికి పరిస్థితి నాకు అర్థమైపోగా, ఆ జవాను నన్ను గుర్తించలేదు కాబట్టి ధైర్యంగా ఇలా అన్నాను. "ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. నేను మాత్రం కాచిగూడా స్టేషన్‌లో టికెట్లు కొన్నాను. మా కుటుంబాన్ని రిక్షాలో తీసుకువెళ్ళాలి. ఆలస్యం కాకూడదు కదా!'' అందుకు అతడు -"ఐతే పక్కనే 'ఎ' వార్డు కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు సత్యనారాయణరెడ్డిగారు ఒక గుడారంలో ఉన్నారు. వెళ్లి వారి అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళవచ్చు'' అన్నాడు.
నేను కాసేపు ఆలోచనలో పడిపోయాను. ఎందుకంటే నన్ను అరెస్టు చేయడానికి సత్యనారాయణరెడ్డి స్వయంగా ప్లానువేసినవాడు. నన్ను బాగా గుర్తుపట్టగలడు. కాబట్టి అక్కడికి ఎంత మాత్రం వెళ్ళలేను. అందుకే ఎక్కువసేపు కాలయాపన చేయకుండా, వెంటనే ఆ జవానుతో ఇలా అన్నాను. "అంతదూరం ఎందుకులే! నేను తిరిగెళ్ళి ఈ టిక్కెట్టు వాపసు చేస్తాను.. మా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాం!''

నా మాటలకు జవాను నా సైకిల్ హ్యాండిల్‌పై నుండి తన చేతిని వెంటనే తొలగించేసిి "సరే వెళ్ళండి. తిరిగి ఈ పూట రాకండి'' అంటూ ఆజ్ఞాపించాడు.

నేను తిరిగి నా కేంద్రానికి చేరుకున్నాను. తెల్లవారగానే చిక్కడపల్లి ఇంటిపై పోలీసులు దాడి చేసారు. అక్కడ నేను లేకపోవడంతో నా ఆచూకీ గురించి ఆరాతీసారు. 'మాకు తెలియదు' అంటూ మా వాళ్ళంతా ఏకత్రాటిపై నిలబడ్డారు. పోలీసులు ఇళ్లంతా సోదాచేసి దొరికిన పుస్తకాల్ని, కాగితాల్ని పోలీస్ వ్యాన్‌లో పడవేసారు.

తర్వాత నా సోదరుడ్ని ఉద్దేశించి "నీవు కూడా కమ్యూనిస్టువేనా?'' అని గద్దించారు.. "అవును! నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యుడినే'' అని నా సోదరుడు ఒకింత కోపంగానే చెప్పాడు. ఆ వెంటనే ఒక అధికారి కల్పించుకుంటూ -" అయితే నారాయణగూడా పోలీస్ స్టేషన్‌కి మాతోరా! మీ పుస్తకాలన్నీ ఇంటికి వాపసు తెచ్చుకోవచ్చు'' అన్నాడు. నా సోదరుడు పోలీసుల వెంబడి వ్యాన్ ఎక్కి స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడ పోలీసులు నా సోదరుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత కఠిన కారాగారంగా పేరుగాంచిన మరాట్వాడాలోని జాల్నా జైలుకు తరలించారు.


తమ్ముడి అనారోగ్యంతో...
ఆనాటికే సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయాలని, జైళ్ళలో కూడా పోరాటాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. జైలు కమిటీలో నా సోదరుడు సిహెచ్. హనుమంతరావు ప్రముఖంగా పనిచేశాడు. ప్రభుత్వం కమ్యూనిస్టు ఖైదీలకు ఆహారం, తదితర సౌకర్యాలను తీవ్రంగా తగ్గించింది. కొంతకాలం తర్వాత..ఆహార కొరత, నిర్బంధ విధానం తదితర కారణాల వల్ల హనుమంతరావు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. జీర్ణశక్తి పూర్తిగా తగ్గి నిస్సత్తువ పెరిగింది.

దీంతో జైలు అధికారులు అనారోగ్యం కారణంగా ఆయనకు ప్రాణాపాయం జరుగుతుందని భయపడిపోయారు. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని జైలునుండి విడుదల చేశారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న నా సోదరుడు, బహుకష్టంగా నడవలేని దీన స్థితిలో - జాల్నా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి వరకు ఎలా చేరుకున్నాడో అంతా కలలోలాగా సాగిపోగా, పూర్తిగా శక్తి సన్నగిల్లిన పరిస్థితిలో, అక్కడే ఫ్లాట్‌ఫాం పైవున్న బెంచీ కింద పడుకుండిపోయాడు.

తర్వాత కాసేపటికి ఒక రైల్వే కూలీ చీకటిలో అటుగా వచ్చి, తన వద్దనున్న సిగ్నల్ లైటు వేసి, బెంచీ కింద పడుకున్న నా సోదరుడ్ని 'ఎవ్వరూ?' అంటూ పలకరించి, అంతలోనే "బాపూ మీరా?' అంటూ నా సోదరుడ్ని గుర్త్తుపట్టిన ఘటన మా పుణ్యఫలం. అతను కరీంనగర్ జిల్లా సిరిసిిల్ల తాలూకాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన వ్యక్తి. అతడి పేరు ఎల్లయ్య.

చిన్నవాడుగా నాగారం గ్రామంలో మా ఇంటిలో ఉద్యోగం చేస్తూ, పిల్లవాడిగా ఉన్న హనుమంతరావుని ఎత్తుకుని ఆడించేవాడు. అందుకే అంత త్వరగా గుర్తుపట్టగలిగాడు. అప్పటికే పూర్తిగా నీరసించిపోయిన నా సోదరుడు జీవచ్ఛవమై ఉన్నాడు. ఎల్లయ్యకి పరిస్థితి అర్థమైపోయింది. ఇక ఏ మాత్రం కాలయాపన చేయలేదు.

నా సోదరుడ్ని అమాంతంగా భుజాలపై ఎత్తుకుని తన గుడిసెకు తీసుకెళ్ళి, స్నానం చేయించి గుడ్డలు మార్చి, తినిపించి, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఒక స్థావరానికి జాగ్రత్తగా చేర్చాడు. సమాచారం తెలుసుకున్న మా నాన్నగారు ఆదుర్దాగా వచ్చి, కరీంనగర్ తీసుకెళ్లారు. ఇంటిలో పునఃఆరోగ్య ప్రాప్తికోసం అమ్మనాన్నలే స్వయంగా పరిచర్యలకు పూనుకున్నారు. ఇదంతా సంభ్రమాశ్చర్యాలతో కూడిన గాథ!

ముస్లింల సహకారంతో...
ఈ సంఘటన ఒక ఆందోళనా తరంగం! 'పోలీస్ యాక్షన్' తర్వాత కమ్యూనిస్టు నాయకులు హిందువుల ఇళ్ళల్లో తలదాచుకొనడం కష్టతరమైపోయింది. కేవలం ఇండియన్ యూనియన్ పట్ల వ్యతిరేక భావాలు కలిగిన ముస్లింల ఇళ్ళల్లో మాత్రమే రక్షణ పొందడం సుసాధ్యంగా ఉండింది. కమ్యూనిస్టు పార్టీకి ముస్లిం మేధావులు మరియు బుద్ధిజీవుల కొరత అనేది లేనేలేదు. ఇది కమ్యూనిస్టు పార్టీ సాధించుకున్న విజయంలో ఒక భాగం.

ముస్లింల సహాయ సహకారాలు ఆ రోజుల్లో పార్టీకి, పార్టీ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడినవి. సిరిసిల్ల నివాసి, సుప్రసిద్ధ వకీలు గారైన 'ఆగాయి' గారి కుమారుడు కీ.శే సిగ్బతుల్లా నా శిష్యుల్లో ఒకడు. ఇతడు నాకు మంచి మిత్రుడు కూడానూ! రహస్య జీవితంలో ఉన్న నన్ను ఒక నవాబు ఇంటిలో ఉండే ఏర్పాటు గావించాడు. ఆ నవాబుగారితో నాకు ఏ మాత్రం పరిచయం లేదు. అయినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో సులభంగానే ఒకర్ని ఒకరం అర్థం చేసుకోవడం జరిగింది.

కాగా, నేను నేనుగా కాకుండా ముస్లిం మతస్థుడిగా 'గయాసుద్దిన్' పేరుతో నవాబుగారికి పరిచయం కావడం జరిగింది. నా వేష భాషలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి శుక్రవారం అక్కడికి దగ్గరగా ఉన్న మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం బాగా అలవాటైపోయింది. కాగా డేగ కన్నులతో నా ఆచూకీ గురించి గాలిస్తున్న పోలీసులు, ఆగాపూర్‌లో ఉన్న ఈ నవాబు ఇంటి పరిసరాల్లో నేను ఉంటున్నట్టు పసిగట్టారు. ఇంకేముంది? ఆ ప్రాంతంలో కాపలా పెంచారు.

అనుమానస్థుల్ని ప్రశ్నిస్తున్నారు... ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రెండవ సినిమా పూర్తి అయ్యేవేళ యథాక్రమంగా నవాబు గారి ఇంటికి వచ్చిన నేను ఇంటిలోకి అడుగుపెట్ట్టీ పెట్టగానే నవాబుగారితో పాటు యూనిఫారంలో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు దర్శనమిచ్చారు. వారిని చూడగానే పట్టుబడిపోతానేమోనన్న ఆందోళన కలిగింది.

అయినప్పటికీ నాలోని భావాలు బయటపడనీకుండా నన్ను నేను తమాయించుకుని ఏమీ తెలియని వాడిలా ఉండిపోయాను. కాగా, నవాబుగారు నన్ను తాగిన నిషా కళ్ళతో చూస్తూ "ఏం గయాస్‌భాయి? ఇంత రాత్రివరకు పనిచేస్తే ఎలా? వేళకు నిద్ర కూడా అవసరం లేదా?'' ఉర్దూలో చాలా సహజంగా అడిగాడు.నేను చిరునవ్వు నవ్వుతూ నా గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాను. నవాబుగారి గంభీరం ఆ రోజు నాకు అర్థం కాలేదు.

తెల్లవారాక సిగ్బతుల్లా నన్ను కలిసి విషయాన్ని ఈ విధంగా వివరంగా తెలియజేశాడు. అది ఏంటంటే... నా కోసం వెదుకుతున్న పోలీస్ అధికారులను నవాబుగారు ప్రత్యేకంగా పిలిపించి, వారికి కడుపునిండా త్రాగించి, భోజనం ఏర్పాట్లు గూడా గావించారు. ముస్లిం ఇండ్లల్లో అతి రుచిగా తయారుచేయబడే కబాబులు ఆనాటి ముఖ్య ఆహారం.

ఆ ఒక్కరాత్రే కాదు, ఆ ప్రాంతంలో పర్యటించే ప్రతిరాత్రి తన ఇంటికి వచ్చి విందు భోజనాన్ని స్వీకరించాలని నవాబు గారు వారితో వాగ్దానం చేయించుకున్నారు. ఇంతేకాదు, మంచి చాకచక్యం ప్రదర్శిస్తూ...పోలీసు అధికారులు తిరిగే ప్రాంతాలు, చేసే ప్రయత్నాల వివరాలు అన్నింటినీ పోలీసుల్నే విందు సమయంలో అడిగి తెల్సుకోవడం, ఆ విషయాల్ని సిగ్బతుల్లాకు తెలియజేయడం, సిగ్బతుల్లా నాకు చేరవేయడం, చేరిన సమాచారం ప్రకారం నేను - నాకు సంబంధించిన వారందరూ జాగ్రత్తపడటం అంతా పకడ్బందిగా సాగిపోయేది. ఆ ప్రాంతంలో నిర్భయంగా తిరిగే సదుపాయాలు నవాబు గారి పుణ్యమా అని ఏర్పడ్డాయి.

Friday, September 24, 2010

వస్తోంది.. ఒక 'నాణ్య'మైన చరిత్ర * 'డాక్యుమెంటేషన్ ఆఫ్ కాయిన్స్'

మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పురాతన నాణేలు దొరికాయో ఎవరైనా చెప్పగలరా? ఇంకా క్విజ్‌లకు ఎక్కని ఈ ప్రశ్నకు ఎవరికైనా జవాబు ఎలా తెలుస్తుంది? అందుకే పురావస్తు పరిశోధన మరియు మ్యూజియంల శాఖ దగ్గరికి వెళితే వాళ్లు ఠక్కున చెప్పారు 2.90 లక్షలని. అమ్మో.. అన్నిట్ని ఏం చేస్తున్నారని అడిగితే డాక్యుమెంటేషన్ అని వచ్చింది జవాబు. పూర్తవ్వగానే అన్ని వివరాలతో ఓ పెద్ద పుస్తకం తీసుకురాబోతున్నారు వాళ్లు. అయితే ఇప్పటికి ఆరోవంతు పని మాత్రమే అయింది. ఆ పనిలో బిజీగా ఉన్న ఆ శాఖ రసాయనిక పరిరక్షణ పరిశోధనశాల డిప్యూటీ డైరెక్టర్ డా.పి.గాయత్రితో మాట్లాడితే ఆవిడ వాటి గురించి ఎన్నో వివరాలు చెప్పారు..

"కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న 'డాక్యుమెంటేషన్ ఆఫ్ కాయిన్స్' ప్రాజెక్టు వల్ల చరిత్రలో అనేక కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదొక అరుదైన కార్యక్రమం. దీని కోసం దేశంలోనే పేరొందిన నాణేల పరిశోధకుడు ఎ.కె. ఝా సహాయం తీసుకున్నాం. మొత్తం 2.90 లక్షల నాణేలలో ఇప్పటి వరకు 44 వేల నాణేల డాక్యుమెంటేషన్ పూర్తయింది. ప్రతి నాణెం బరువు, పరిమాణం, వ్యాసార్ధం, లిపిలతో పాటు ఏ కాలానికి చెందినదో తెలిపే వివరాలన్నీ ఇందులో ఉంటాయి.

అన్ని నాణేల డాక్యుమెంటేషన్ పూర్తవ్వగానే, ఫోటోలతో సహా ప్రచురిస్తారు. డాక్యుమెంటేషన్ అంటే- ప్రతి నాణెం ఎక్కడ దొరికింది..? ఏ కాలం నాటిది..? అప్పుడు పాలించిన రాజులు ఎవరు..? నాణేలకు ఇరువైపులా ఎలాంటి ముద్రలు, గుర్తులు ఉన్నాయి..? భాష ఏమిటి, బ్రాహ్మియా, ప్రాకృతమా? ఒకే పోలిక కలిగినవి ఎక్కడెక్కడ లభించాయి..? ఈ సమాచారమంతా సేకరిస్తుంది పురావస్తుశాఖ. దీనికి ల్యాబ్‌లో మా వంతు సహకారం అందిస్తున్నాం. మొత్తం నాణేల డాక్యుమెంటేషన్ పూర్తయితే చరిత్రకారులు, పురాతత్వ పరిశోధకులు, నాణేల అధ్యయనకారులకు ఎంతో పనికొస్తుంది. మరింత కచ్చితమైన చరిత్ర నిర్మాణంలో నాణేల పాత్ర ఇంకా పెరుగుతుంది.

చరిత్రను తిరగరాస్తాయి..
పురాతన నాణేలు దొరకగానే వాటిని రహస్యంగా అమ్మేసుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటారు చాలామంది. ఇది చాలా తప్పు. ప్రతి పురాతన నాణెం అమ్మితే వచ్చే డబ్బుకంటే, దాన్ని సామాజిక ఆస్తిగా భద్రపరిస్తే వచ్చే ప్రయోజనమే ఎక్కువ. ఒక్కోసారి కొన్ని నాణేలు చరిత్రను తిరగరాస్తాయి. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో దొరికిన నాణేల వల్ల అదే జరిగింది. చరిత్ర చదువుకున్న అందరికీ శాతవాహనుల గురించి తెలుసు.

కానీ, తొలి రాజు ఎవ్వరనే మీమాంస ఉండేది. కోటిలింగాల తవ్వకాలలో నాణేలు లభ్యమయ్యాక- శాతవాహనుల తొలిరాజు శ్రీముఖుడు అని నిర్ధారణ అయ్యింది. విజయనగరం జిల్లాలోని కోనయ్యవలసలో లభించిన వెండి నాణేలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇలాంటి నాణేలు మన దేశంలో ఇంకెక్కడా లేవు. అలాగే కీసరగుట్టలో దొరికిన నాణేలను బట్టి ఈ ప్రాంతాన్ని విష్ణుకుండినులు పాలించినట్లు తెలుసుకున్నాం. అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో 5,242 సీసపు నాణేలు బయటపడ్డాయి. వాటి మీద రాజులపేర్లు లేవు. కానీ, ఒకే ఒక్క నాణెం మీద పూర్ణకుంభం బొమ్మ ఉంది.

ఎక్కడెక్కడ దొరికాయి...
నాణేలు రాజుల పేర్లనే కాదు. రాజుల ఆర్థిక పరిస్థితిని కూడా చెబుతాయి. ఇప్పటి వరకూ మనకు దొరికిన వాటిలో తూర్పుచాళుక్యులకు సంబంధించి రాగి, మిశ్రమ (జింక్, టిన్)లోహ నాణేలు ఉన్నాయి. కాకతీయుల కాలంనాటి కప్‌షేప్ కాయిన్స్, విజయనగర సామ్రాజ్యంనాటి రాగి, వెండి, బంగారు నాణేలు ఉన్నాయి. మొఘలుల కాలంలో వెండి బాగా చెలామణిలో ఉన్నట్లు దొరికినవాటిని బట్టి తెలుస్తోంది. కుతుబ్‌షాహీల కాలంనాటి రాగి రూకలు దొరికాయి. ఖమ్మం జిల్లాలో రోమన్ బంగారు నాణేలు చిక్కాయి. ఒకటవ నిజాం నుంచి ఆరవ నిజాం వరకు చార్మినార్ సిక్కాలు (నాణేలు) దొరికాక.. ఏ కాలంలో ఏ నిజాం పాలించాడో సులువుగా తెలుసుకునేందుకు వీలైంది. నాణేల మీద రాజుల పేర్లు ముద్రించుకోవడం శాతవాహనుల కాలం నుంచే మొదలైందని ఇప్పటివరకు లభ్యమైన నాణేలను బట్టి చెప్పవచ్చు.

నాణేలు లభించినప్పుడు ఎవరికి సమాచారాన్ని ఇవ్వాలో చాలామందికి తెలియదు. పొలం దున్నుతున్నప్పుడో, పాత ఇంటి పునాదులు తవ్వుతున్నప్పుడో కొన్ని చోట్ల నాణేలు బయటపడుతుంటాయి. పాటిదిబ్బలు, పురాతన దేవాలయాలు, కట్టడాలు, బౌద్ధస్థూపాలున్న ప్రదేశాలలో మా శాఖ కూడా తవ్వకాలు చేస్తుంటుంది. ఈ ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించడానికి పురావస్తు అన్వేషకులు పనిచేస్తుంటారు.

గ్రామాలలో నాణేలు దొరికిన వెంటనే, స్థానిక సర్పంచు, పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించవచ్చు. వారు అక్కడే నాణేలకు పంచనామా చేసి కలెక్టర్‌కు పంపిస్తారు. జిల్లా కేంద్రంలోని ట్రెజరీలో భద్రపరుస్తారు. అక్కడి నుంచి పురావస్తు శాఖకు చేరవేస్తారు. సొంత భూముల్లో నాణేలు దొరికితే 'నిధి నిక్షేపాల చట్టం' కింద పరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ సమాచారం చెప్పకపోయినా నేరమే అవుతుంది.

మాకు రోజూ ఆసక్తే...
నాణేలను శుభ్రపరిచే పని హైదరాబాద్‌లోని పురావస్తు పరిశోధనశాల చేస్తుంది. ఈ శాఖకు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నేను కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆర్కియాలజీలో పీహెచ్‌డీ చేశాను. 23 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఎంతో చరిత్ర కలిగిన పురాతన నాణేలు ఇక్కడికొస్తుంటాయి. అందుకే మాకు రోజూ ఆసక్తే. నాణేల మీద గుర్తులు భలే విచిత్రంగా ఉంటాయి. స్వస్తిక్, సూర్యుడు, ఏనుగు, గుర్రం, నది, చెట్టు.. ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గుర్తుల వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో. రాజులు వీటినే ఎందుకు ఎంచుకున్నారో పరిశోధిస్తే, కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.

ఈ ముద్రలు, అక్షరాలు దెబ్బతినకుండా నాణేలను రసాయనాలతో కడుగుతాం. నాణేలకు వాడిన లోహాలను బట్టి రసాయనాలను వాడతాం. సీసపు నాణేలను శుభ్రపరిచేందుకు హైడ్రోక్లోరిక్ ఆసిడ్‌ను వాడతాం. తర్వాత డిస్టిల్‌వాటర్‌తో కడిగి అమ్మోనియం ఎసిటేట్‌లో కాసేపు ముంచి తీసేస్తాం. నాణేలకున్న తడి ఆరిపోయాక మైక్రోక్రిస్టలైన్ వాక్స్ పూసి భద్రపరుస్తాం. రాగి నాణేలకైతే జింక్ కాస్టిక్‌ట్రీట్‌మెంట్ ఇస్తాం. వెండి, మిశ్రమలోహ నాణేలను ఫార్మిక్, సిట్రిక్‌యాసిడ్‌లతో క్లీన్ చేస్తాం. ఒక్కోసారి అల్ట్రా సోనిక్ క్లీనర్ ఉపయోగిస్తాం. అవసరమైతే డెంటల్ క్లీనింగ్ మిషిన్ వాడి పాత నాణేలను మిలమిల మెరిసేలా చేస్తాం. శుభ్రపరిచే ప్రక్రియ పూర్తయ్యాక, నాణేలను రెజిన్ (పౌడర్)లో అద్ది భద్రపరుస్తాం.

దీన్నే లాకరింగ్ అని పిలుస్తాం. ఇది నిత్యం జరిగేదే. ప్రస్తుతం పురావస్తుశాఖ దగ్గరున్న అన్ని నాణేలకు డాక్యుమెంటేషన్ మాత్రం చేస్తున్నాం..'' అంటూ ముగించారు డాక్టర్ గాయత్రి.
జూ ఆది మల్లెంపూటి
ఫోటోలు : లవకుమార్