Saturday, November 20, 2010

అమరశిల్పి జక్కన

Kasivisvesvara
జక్కనాచారి అమరశిల్పిగా పేరుప్రఖ్యాతులు గావించారు. క్రీ.శ. 12వ శతాబ్దంలో కర్నాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్నాటక రాష్ట్రం, హసన్‌ జిల్లా బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం.

జీవితచరిత్ర: జక్కనాచారి కర్ణాటకలోని తుముకూరు దగ్గర కైదల అనే గ్రామంలో జన్మించాడు. ఆయన జీవితం అంతా కళలకు అంకితం చేసిన ధన్యజీవి. ఇతడు నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు. వివాహం చేసుకున్న అనతికాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను,తన కుటుంబాన్ని సైతం మరిచిపోయాడు.

jakkana1
కాగా జక్కనాచారికి ఒకే ఒక్క మగబిడ్డ. అతడే ఢంకనాచారి. చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం వెళతాడు. బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు. కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. పరీక్షించిన తరువాత ఆ శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది. ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు. ఆ సమయంలోనే వీరిద్దరు తండ్రీకొడుకులని గుర్తిస్తారు. ఢక్కన తండ్రిని మించిన తనయునిగా ప్రసిద్ధిపొందుతాడు.

చెన్నకేశవ ఆలయం, బేలూరు: అనంతరం జక్కనాచారికి క్రిడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది. అది పూర్తయిన తరువాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ సంఘటన ప్రకారం, క్రిడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు. కన్నడంలో ’కై’ అనగా చేయి అని అర్థం. జక్కనాచారి అవార్డులు: ఇంతటి ప్రసిద్ధిచెందిన కళాకారుని జ్ఞాపకార్ధం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు, కళాకారులకు జక్కనాచారి పేరిట అవార్డులు ప్రదానం చేయడం విశేషం. 1964 సంవత్సరంలో డా.అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన అమరశిల్పి జక్కన విడుదలై అఖండ విజయం సాధించడం విశేషం.

No comments: