Monday, November 15, 2010

కబాబులు తిని వదిలేశారు

మన రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలలో చెన్నమనేని రాజేశ్వరరావు ఒకరు. నిజాం కాలంలో జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరపున పోరాడిన యోధుడిగా ఆయన జ్ఞాపకాలు ఈ తరం వారికి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాజేశ్వరరావు తన అనుభవాలన్నింటినీ గుదిగుచ్చి అందించిన ఆత్మకథే 'సత్యశోధన'. 
ఇటీవలే విడుదలైన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు -
 
కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఉంటున్న రోజుల్లో హైదరాబాద్‌లో నన్ను అరెస్టు చేయడానికి ప్రత్యేక నిఘా విభాగం పని చేసింది. నేను చిక్కడపల్లి దేవాలయం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నాను. నాతో పాటు మా అమ్మ, నా భార్య లలిత, మా పాప అరుణ, నా సోదరుడు హనుమంతరావులు ఉండేవారు.

నిండు జనారణ్యంలోనే అయినప్పటికీ అది మా రహస్య స్థావరం. ఈ స్థావరాన్ని కాపలాకాస్తూ, మా అన్ని అవసరాల్ని తీర్చే బాధ్యతను నా మిత్రుడు శ్రీ ఎన్. ధర్మారావుగారు చూస్తుండేవారు. ఇతడు ఎల్.ఐ.సి అధికారిగా ఉండేవాడు. ఇక్కడ నా జీవితపు దినచర్య చాలా పకడ్బందీగా ఉండేది. రాత్రుళ్ళు నారాయణగూడాలో ఉన్న ధర్మారావుగారి ఇంటిలో గడుపుతూ, తెల్లవారకమునుపే సైకిల్‌పై చిక్కడపల్లి స్థావరం చేరుకుని పగళ్ళు గడిపేవాడిని. ఎలాగోలా పోలీసులు నా స్థావరం ఆచూకీ పసిగట్టేసారు. ఇంకేముంది? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను అరెస్టు చేసేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి ముందు, ఇంటి చుట్టూ, సాయుధ పోలీసులు కాపలా కాస్తున్నారు.

గుర్తుపట్టకపోవడంతో....

ఇదేమీ తెలియని నేను యథాప్రకారం తెల్లవారుఝాము 5 గంటల వేళ సైకిల్‌పై నా స్థావరానికి వెళ్ళేదారిని చేరాను. అక్కడ ఒక పోలీసు నా సైకిల్‌ని ఆపి, సైకిల్ హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకుని, ఉర్దూబాషలో "ఈ రోజు సి.హెచ్. రాజేశ్వరరావుని అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆయన స్థావరం చుట్టూ గట్టి కాపలా పెట్టాం. కాబట్టి చిక్కడపల్లి నుండి మనిషి ఎవరూ బయటకు వెళ్ళరాదు. బయటి నుండి కూడా లోపలికి ఎవ్వరూ పోవడానికి వీలులేదు'' అన్నాడు.

అప్పటికి పరిస్థితి నాకు అర్థమైపోగా, ఆ జవాను నన్ను గుర్తించలేదు కాబట్టి ధైర్యంగా ఇలా అన్నాను. "ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. నేను మాత్రం కాచిగూడా స్టేషన్‌లో టికెట్లు కొన్నాను. మా కుటుంబాన్ని రిక్షాలో తీసుకువెళ్ళాలి. ఆలస్యం కాకూడదు కదా!'' అందుకు అతడు -"ఐతే పక్కనే 'ఎ' వార్డు కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు సత్యనారాయణరెడ్డిగారు ఒక గుడారంలో ఉన్నారు. వెళ్లి వారి అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళవచ్చు'' అన్నాడు.
నేను కాసేపు ఆలోచనలో పడిపోయాను. ఎందుకంటే నన్ను అరెస్టు చేయడానికి సత్యనారాయణరెడ్డి స్వయంగా ప్లానువేసినవాడు. నన్ను బాగా గుర్తుపట్టగలడు. కాబట్టి అక్కడికి ఎంత మాత్రం వెళ్ళలేను. అందుకే ఎక్కువసేపు కాలయాపన చేయకుండా, వెంటనే ఆ జవానుతో ఇలా అన్నాను. "అంతదూరం ఎందుకులే! నేను తిరిగెళ్ళి ఈ టిక్కెట్టు వాపసు చేస్తాను.. మా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాం!''

నా మాటలకు జవాను నా సైకిల్ హ్యాండిల్‌పై నుండి తన చేతిని వెంటనే తొలగించేసిి "సరే వెళ్ళండి. తిరిగి ఈ పూట రాకండి'' అంటూ ఆజ్ఞాపించాడు.

నేను తిరిగి నా కేంద్రానికి చేరుకున్నాను. తెల్లవారగానే చిక్కడపల్లి ఇంటిపై పోలీసులు దాడి చేసారు. అక్కడ నేను లేకపోవడంతో నా ఆచూకీ గురించి ఆరాతీసారు. 'మాకు తెలియదు' అంటూ మా వాళ్ళంతా ఏకత్రాటిపై నిలబడ్డారు. పోలీసులు ఇళ్లంతా సోదాచేసి దొరికిన పుస్తకాల్ని, కాగితాల్ని పోలీస్ వ్యాన్‌లో పడవేసారు.

తర్వాత నా సోదరుడ్ని ఉద్దేశించి "నీవు కూడా కమ్యూనిస్టువేనా?'' అని గద్దించారు.. "అవును! నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యుడినే'' అని నా సోదరుడు ఒకింత కోపంగానే చెప్పాడు. ఆ వెంటనే ఒక అధికారి కల్పించుకుంటూ -" అయితే నారాయణగూడా పోలీస్ స్టేషన్‌కి మాతోరా! మీ పుస్తకాలన్నీ ఇంటికి వాపసు తెచ్చుకోవచ్చు'' అన్నాడు. నా సోదరుడు పోలీసుల వెంబడి వ్యాన్ ఎక్కి స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడ పోలీసులు నా సోదరుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత కఠిన కారాగారంగా పేరుగాంచిన మరాట్వాడాలోని జాల్నా జైలుకు తరలించారు.


తమ్ముడి అనారోగ్యంతో...
ఆనాటికే సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయాలని, జైళ్ళలో కూడా పోరాటాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. జైలు కమిటీలో నా సోదరుడు సిహెచ్. హనుమంతరావు ప్రముఖంగా పనిచేశాడు. ప్రభుత్వం కమ్యూనిస్టు ఖైదీలకు ఆహారం, తదితర సౌకర్యాలను తీవ్రంగా తగ్గించింది. కొంతకాలం తర్వాత..ఆహార కొరత, నిర్బంధ విధానం తదితర కారణాల వల్ల హనుమంతరావు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. జీర్ణశక్తి పూర్తిగా తగ్గి నిస్సత్తువ పెరిగింది.

దీంతో జైలు అధికారులు అనారోగ్యం కారణంగా ఆయనకు ప్రాణాపాయం జరుగుతుందని భయపడిపోయారు. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని జైలునుండి విడుదల చేశారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న నా సోదరుడు, బహుకష్టంగా నడవలేని దీన స్థితిలో - జాల్నా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి వరకు ఎలా చేరుకున్నాడో అంతా కలలోలాగా సాగిపోగా, పూర్తిగా శక్తి సన్నగిల్లిన పరిస్థితిలో, అక్కడే ఫ్లాట్‌ఫాం పైవున్న బెంచీ కింద పడుకుండిపోయాడు.

తర్వాత కాసేపటికి ఒక రైల్వే కూలీ చీకటిలో అటుగా వచ్చి, తన వద్దనున్న సిగ్నల్ లైటు వేసి, బెంచీ కింద పడుకున్న నా సోదరుడ్ని 'ఎవ్వరూ?' అంటూ పలకరించి, అంతలోనే "బాపూ మీరా?' అంటూ నా సోదరుడ్ని గుర్త్తుపట్టిన ఘటన మా పుణ్యఫలం. అతను కరీంనగర్ జిల్లా సిరిసిిల్ల తాలూకాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన వ్యక్తి. అతడి పేరు ఎల్లయ్య.

చిన్నవాడుగా నాగారం గ్రామంలో మా ఇంటిలో ఉద్యోగం చేస్తూ, పిల్లవాడిగా ఉన్న హనుమంతరావుని ఎత్తుకుని ఆడించేవాడు. అందుకే అంత త్వరగా గుర్తుపట్టగలిగాడు. అప్పటికే పూర్తిగా నీరసించిపోయిన నా సోదరుడు జీవచ్ఛవమై ఉన్నాడు. ఎల్లయ్యకి పరిస్థితి అర్థమైపోయింది. ఇక ఏ మాత్రం కాలయాపన చేయలేదు.

నా సోదరుడ్ని అమాంతంగా భుజాలపై ఎత్తుకుని తన గుడిసెకు తీసుకెళ్ళి, స్నానం చేయించి గుడ్డలు మార్చి, తినిపించి, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఒక స్థావరానికి జాగ్రత్తగా చేర్చాడు. సమాచారం తెలుసుకున్న మా నాన్నగారు ఆదుర్దాగా వచ్చి, కరీంనగర్ తీసుకెళ్లారు. ఇంటిలో పునఃఆరోగ్య ప్రాప్తికోసం అమ్మనాన్నలే స్వయంగా పరిచర్యలకు పూనుకున్నారు. ఇదంతా సంభ్రమాశ్చర్యాలతో కూడిన గాథ!

ముస్లింల సహకారంతో...
ఈ సంఘటన ఒక ఆందోళనా తరంగం! 'పోలీస్ యాక్షన్' తర్వాత కమ్యూనిస్టు నాయకులు హిందువుల ఇళ్ళల్లో తలదాచుకొనడం కష్టతరమైపోయింది. కేవలం ఇండియన్ యూనియన్ పట్ల వ్యతిరేక భావాలు కలిగిన ముస్లింల ఇళ్ళల్లో మాత్రమే రక్షణ పొందడం సుసాధ్యంగా ఉండింది. కమ్యూనిస్టు పార్టీకి ముస్లిం మేధావులు మరియు బుద్ధిజీవుల కొరత అనేది లేనేలేదు. ఇది కమ్యూనిస్టు పార్టీ సాధించుకున్న విజయంలో ఒక భాగం.

ముస్లింల సహాయ సహకారాలు ఆ రోజుల్లో పార్టీకి, పార్టీ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడినవి. సిరిసిల్ల నివాసి, సుప్రసిద్ధ వకీలు గారైన 'ఆగాయి' గారి కుమారుడు కీ.శే సిగ్బతుల్లా నా శిష్యుల్లో ఒకడు. ఇతడు నాకు మంచి మిత్రుడు కూడానూ! రహస్య జీవితంలో ఉన్న నన్ను ఒక నవాబు ఇంటిలో ఉండే ఏర్పాటు గావించాడు. ఆ నవాబుగారితో నాకు ఏ మాత్రం పరిచయం లేదు. అయినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో సులభంగానే ఒకర్ని ఒకరం అర్థం చేసుకోవడం జరిగింది.

కాగా, నేను నేనుగా కాకుండా ముస్లిం మతస్థుడిగా 'గయాసుద్దిన్' పేరుతో నవాబుగారికి పరిచయం కావడం జరిగింది. నా వేష భాషలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి శుక్రవారం అక్కడికి దగ్గరగా ఉన్న మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం బాగా అలవాటైపోయింది. కాగా డేగ కన్నులతో నా ఆచూకీ గురించి గాలిస్తున్న పోలీసులు, ఆగాపూర్‌లో ఉన్న ఈ నవాబు ఇంటి పరిసరాల్లో నేను ఉంటున్నట్టు పసిగట్టారు. ఇంకేముంది? ఆ ప్రాంతంలో కాపలా పెంచారు.

అనుమానస్థుల్ని ప్రశ్నిస్తున్నారు... ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రెండవ సినిమా పూర్తి అయ్యేవేళ యథాక్రమంగా నవాబు గారి ఇంటికి వచ్చిన నేను ఇంటిలోకి అడుగుపెట్ట్టీ పెట్టగానే నవాబుగారితో పాటు యూనిఫారంలో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు దర్శనమిచ్చారు. వారిని చూడగానే పట్టుబడిపోతానేమోనన్న ఆందోళన కలిగింది.

అయినప్పటికీ నాలోని భావాలు బయటపడనీకుండా నన్ను నేను తమాయించుకుని ఏమీ తెలియని వాడిలా ఉండిపోయాను. కాగా, నవాబుగారు నన్ను తాగిన నిషా కళ్ళతో చూస్తూ "ఏం గయాస్‌భాయి? ఇంత రాత్రివరకు పనిచేస్తే ఎలా? వేళకు నిద్ర కూడా అవసరం లేదా?'' ఉర్దూలో చాలా సహజంగా అడిగాడు.నేను చిరునవ్వు నవ్వుతూ నా గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్నాను. నవాబుగారి గంభీరం ఆ రోజు నాకు అర్థం కాలేదు.

తెల్లవారాక సిగ్బతుల్లా నన్ను కలిసి విషయాన్ని ఈ విధంగా వివరంగా తెలియజేశాడు. అది ఏంటంటే... నా కోసం వెదుకుతున్న పోలీస్ అధికారులను నవాబుగారు ప్రత్యేకంగా పిలిపించి, వారికి కడుపునిండా త్రాగించి, భోజనం ఏర్పాట్లు గూడా గావించారు. ముస్లిం ఇండ్లల్లో అతి రుచిగా తయారుచేయబడే కబాబులు ఆనాటి ముఖ్య ఆహారం.

ఆ ఒక్కరాత్రే కాదు, ఆ ప్రాంతంలో పర్యటించే ప్రతిరాత్రి తన ఇంటికి వచ్చి విందు భోజనాన్ని స్వీకరించాలని నవాబు గారు వారితో వాగ్దానం చేయించుకున్నారు. ఇంతేకాదు, మంచి చాకచక్యం ప్రదర్శిస్తూ...పోలీసు అధికారులు తిరిగే ప్రాంతాలు, చేసే ప్రయత్నాల వివరాలు అన్నింటినీ పోలీసుల్నే విందు సమయంలో అడిగి తెల్సుకోవడం, ఆ విషయాల్ని సిగ్బతుల్లాకు తెలియజేయడం, సిగ్బతుల్లా నాకు చేరవేయడం, చేరిన సమాచారం ప్రకారం నేను - నాకు సంబంధించిన వారందరూ జాగ్రత్తపడటం అంతా పకడ్బందిగా సాగిపోయేది. ఆ ప్రాంతంలో నిర్భయంగా తిరిగే సదుపాయాలు నవాబు గారి పుణ్యమా అని ఏర్పడ్డాయి.

No comments: