Friday, May 13, 2011

అటకెక్కిన తెలుగు వైభవం

తెలుగు సంస్కృతీ వైభవానికి ప్రతీకలుగా నిలిచే అద్భుత కళాఖండాలు, మన ఘన చరిత్రను దృశ్యమానం చేసే చిత్రాలు మూడున్నర దశాబ్దాలుగా మట్టికొట్టుకు పోతున్నాయి. రాజధాని నడిబొడ్డున ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలోని 'తరతరాల తెలుగుజాతి వైభవం' సంస్కృతి పట్ల మన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. తీవ్ర ఉపేక్షకు గురౌతున్న 'తెలుగువైభవం' గురించి.....
తెలుగువారంతా పదిలంగా కాపాడుకోవాల్సిన 'కళాసంపద' కాంతివిహీనం అవుతున్నది. తరతరాల తెలుగుజాతి వైభవం పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ప్రాంగణంలో మూడు అంతస్తుల్లో గల వేలాది కళాకృతులు, సంస్కృతి చిహ్నాలు పట్టించుకునేవారు లేక ఛిద్రం అవుతున్నాయి. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన కాలం నుంచి ఎందరెందరో మహానుభావులు శ్రమించి సేకరించి అపురూప కళాకృతులన్నీ దుమ్ము ధూళి కొట్టుకొని, శిథిలం అవుతున్నాయి.

ఇవన్నీ లక్షల రూపాయల విలువ ఉన్నవే కాదు, అపురూపమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అరుదైన చిత్రాలు, అద్భుతమైన శిల్పాలు ఉన్న తెలుగుజాతి వైభవ ప్రాంగణం అంతా దుమ్ముపట్టిపోయి బావురుమంటోంది. 1985లో నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయంలో భద్రంగా, ప్రతినిత్యం వేలవేల మంది సందర్శించి, ఆనందించేలా ఉండాల్సిన మ్యూజియం చూసే నాథుడే లేక వెలవెలబోతోంది. చిత్రకళా సంపదలో చరిత్ర, బొమ్మల కొలువు, మరపురాని మనీషులు పేరిట మూడు ప్రాంగణాలలో విశాలమైన భవంతిలో రూపకల్పన చేసిన ప్రదర్శనశాల దుస్థితిపై చూపుసారిస్తే చాలు తెలుగుదనంపై కాసింత మక్కువ ఉన్నవారి గుండెలు భగ్గుమంటాయి.

కళ్లముందు కదలాడే చరిత్ర

వర్తులాకారంగా ఉండే విశాలమైన తొలి అంతస్తులో మొట్టమొదటి చిత్రంతోటే చూపరుల మనసుపై మూడు వేల ఏళ్ళ నాటి తెలుగు పెద్దల చరిత్ర హత్తుకుపోతుంది. టిబెట్ మత గ్రంథాలలో దొరికిన ఒక చిత్రం ప్రతిరూపుతో ఇక్ష్వాకుల కాలంగా చెప్పుకునే రోజుల్లోని అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం అధినేత ఆచార్య నాగార్జునుడు అగుపిస్తాడు. ఆ తరువాత ద్రాక్షారామం, ఆ పక్కన అగస్త్యుడు, దాని చెంతనే పంచవటితో ప్రతి సందర్శకుడి ఆలోచనలు గత చరిత్రలోకి మళ్ళుతాయి.

ఆ వరుసలోనే బోధాయనుడు, హల చక్రవర్తి జలక్రీడలు, నాటి భాషా చమత్కారం చరిత్రను తట్టి లేపుతాయి. గుణాఢ్యుడు 7 లక్షల కథల్ని తన రక్తంతో రాశాడని అప్పటి రాజు రచయితపై కోపంతో తగులబెట్టించాడనే బృహత్కథ నుంచి చివరకు లక్ష కథలే మిగిలాని తెలిసి మనసు చివుక్కుమంటుంది. శ్రీశైలం, పల్నాటి నాగమ్మ, రామప్పగుడి, జాయప సేనాని, నెల్లూరు నుంచి ఓరుగల్లు వచ్చి కాకతీయ చక్రవర్తికి భారతం వినిపించిన తిక్కన, గోన గన్నారెడ్డిపై విజయం సాధించిన రుద్రమ, మోటుపల్లి ఓడరేవు మార్కోపోలోతో వ్యాపారం, హంపి, లకుమ, శ్రీనాథుడు, పోతన, వేమన, తానీషా, త్యాగయ్య, బొబ్బిలి మల్లమ్మ వంటి చారిత్రక వైభవ చిత్రాలు కాగితాలు, మాటలు అవసరం లేకుండానే తెలుగుదనాన్ని ఉప్పొంగిస్తాయి. డి.దొరైస్వామి, కనక సూరిబాబు, డి.ఎల్.ఎన్.రెడ్డి, కె.రాజయ్య, సయ్యద్ బీన్ మొహమ్మద్, పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె వాణి వంటివారు కళ్ళముందు నిలిపిన అద్భుత చిత్రాలు మన వైభవాన్ని చాటిచెబుతాయి.

మాట్లాడే బొమ్మలు

కలంకారి కళ, అమరావతి పాలకుడిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తెచ్చిన నాగార్జునసాగర్, ఆంధ్ర సిమెంట్ ఇతర పరిశ్రమలు- 1913లో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ, 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా నమూనా, బందరులో జాతీయ జెండా ఎగురవేస్తుంటే పోలీసులు లాఠీలతో చితకబాదినప్పుడు స్పృహ తప్పినా జెండా వదలని తోట నర్సయ్య, 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ - అండమాన్‌లో కఠిన జైలుశిక్షలో 48 రోజులు నిరాహారదీక్ష చేసిన ప్రతివాది భయంకరాచార్య వంటి వారి బొమ్మలు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల ఉదంతాల్ని కళ్ళముందుంచుతాయి.

గతంలోని మేనా, చిన్నరథం, వీణలు, శిల్పాలు వంటివి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కథలు కథలుగా మన ముందు పరుస్తాయి. వీటన్నింటినీ చూస్తూ.... మన తెలుగు వైభవాన్ని మరింత ఆస్వాదిద్దాం అనుకొనే వారికి విశ్వవిద్యాలయం కల్పించిన అడ్డంకులతో ఆశాభంగం కలుగుతుంది. పై రెండు అంతస్తుల్లో 2200కి పైగా కళాఖండాలు ఉన్నాయిని చెబుతారు కానీ, వాటిని చూసేందుకు సందర్శకులకు అవకాశం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తుంది.

ఉపేక్షకు దర్పణం

1975లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ మహాసభల్లో తెలుగు జాతి సంస్కృతి ప్రదర్శన కోసం అపురూపమైన వస్తువుల సేకరణ జరిగింది. వాటన్నింటిని చూసి లక్షలాది మంది పరవశించారు. శభాష్ అన్నారు. 'లలితకళాసమితి', తెలుగు భాషాసమితి' వంటి వారు ఆ రోజుల్లో లక్షలు లక్షలు ఖర్చుపెట్టి 2600 పైచిలుకు కళాకృతుల్ని సేకరించారు. అకాడమీల రద్దుతో యూనివర్సిటీకి బాధ్యతలు ఒప్పగించారు. వాటన్నింటిని నాటి పెద్దలు కొండంత ఆశతో విశ్వవిద్యాలయానికి వారసత్వ కానుకగా ఇచ్చారు. అపారమైన విలువగల ఆ కళాసంపద గురించి తగ మూడున్నర దశాబ్దాలుగా దృష్టిపెట్టిన వారే లేదు.

కోట్ల రూపాయల విలువ వుంటుందని గొప్పగా చెప్పుకునే ఎం.ఎఫ్.హుసేన్ వంటివారి పెయింటింగ్‌తో సహా వేలవేల చిత్రాలు యూనివర్సిటీ పరం అయ్యాయి. అప్పటి వి.సి. మనసుపెట్టి తమ గదిలో అలంకరించుకున్న చిత్రాలు మాత్రం కళ తప్పకుండా అందరి కళ్లముందున్నాయి. మ్యూజియంలో మూటలు మూటలుగా, అంగుళాల మందంతో దుమ్ము పేరుకుపోయిన తెలుగు సంస్కృతీ సంపద మన ఉపేక్షకు నిలువుటద్దంగా పడివున్నది. వాటి విలువ తెలిసిన సిబ్బంది ఎంత మొత్తుకున్నా, అంతులేని నిధుల కొరతతో అవన్నీ అటకమీద మిగిలిపోయాయి. పాతతరం ఉద్యోగులు రిటైర్ కావడంతో కొత్తతరం వారికి వాటి గొప్పతనం తెలియక, ఆ మూటల్లో ఆసలు ఏముందో కూడా తెలియకుండా పోయింది.

దీంతో మేటి చిత్రకారులు, వారి చిత్తరువులు ఆలనా పాలనా లేకుండా కళావిహీనం అయిపోతున్నాయి. సంబంధిత రికార్డులు, వాటి వివరాలు తెలిసిన వారు ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధం లేకుండా దూరం అయిపోయారు. చాలామంది కాలం చేయడంతో ఏం జరుగుతుందో, ఎలా పరిరక్షించుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. కొద్దిమంది పట్టు విడవకుండా పెద్దల వెంటబడితే కష్టంగా కాసిని నిధులు కేటాయిస్తే అపురూప చిత్రాలు, కళాఖండాలు రాక్‌లలోకి ఎక్కాయి. అయితే ఇప్పుడవి మొత్తంగా బూజు, ధూళితో దులపటం కూడా కష్టం అనిపించేటంతగా అట్టలుకట్టిపోయాయి.

అద్భుతాలు చేసే వీలున్నా..

ఈ దుస్థితిపై పలకరిస్తే ఏం చేయమంటారన్నట్లుగా ఉంది అధికారుల సమాధానం. తమ ప్రతిపాదనలు, సూచనల్ని ఆలకించేవారు కూడా లేకుండా పోయారన్న ఆక్రోశం అందరిలో పొంగుతోంది. ఇతర మ్యూజియాలకు దీటుగా, పోటాపోటీగా చేయగల సత్తా ఉన్నా ప్రోత్సాహం లేదని వాపోతున్నారు. నగర శివార్లలోని బాచుపల్లికి యూనివర్సిటీ క్యాంపస్ తరలి వెళ్తే, నాంపల్లిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని అద్భుతమైన తెలుగు కళా ప్రదర్శనశాలగా తీర్చిదిద్దుతాం అంటున్నారు అధికారులు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహణలో గల చిత్రమయిలో మూడు అంతస్తుల విశాల ప్రాంగణంలో బోలెడంత జాగా అందుబాటులో ఉందిగా అంటూ కొందరు కళాభిమానులు దారి చూపిస్తున్నారు. పర్యాటక శాఖ, ఇతర సంస్థలు నిర్వహించే నగర సందర్శన స్థలాల్లో ఈ ప్రాంగణాన్ని కూడా చేర్చి ప్రోత్సహిస్తే అపార ఆదరణతోపాటు, ఆదాయం కూడా పొందే అవకాశాలున్నాయి. వనరుల కన్నా మంచి సంకల్పం, చిత్తశుద్ధి వుంటే భావి తరాలకు మన తెలుగుదనం వారసత్వాన్ని ఉత్తేజమయంగా అందించవచ్చని సాంస్కృతిక రంగ అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.

No comments: