Sunday, July 10, 2011

నూటొక్క గుమ్మాల మేడ

'నూటొక్క జిల్లాల అందగాడు' అనడం విన్నారుగానీ, నూటొక్క గుమ్మాలున్న ఇల్లు గురించి విన్నారా ఎప్పుడైనా? నూటొక్క గుమ్మాలున్నాయంటే దాన్ని ఇల్లు అనాలా లేక, కోట అనాలా అన్న సందేహం వస్తుంది. కానీ అది కోట కాదు, అచ్చమైన అందాల పొదరిల్లు. విశాఖపట్నం నుంచి బయల్దేరి పచ్చపచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ యలమంచిలి దాటి గుడివాడ గ్రామానికి వెళితే అత్యద్భుతమైన సౌందర్యంతో అలరిస్తుంది ఆ నూటొక్క గుమ్మాల ఇల్లు...

ఊళ్లోకి అడుగుపెట్టక ముందే లేపాక్షి బసవన్న సైజులో రంగురంగుల బసవన్న ఠీవిగా ఉన్న శిల్పం స్వాగతిస్తుంది. ఆ దారిలో కాస్త దూరం సాగితే ఊహకందని అందంతో అకస్మాత్తుగా నూటొక్క గుమ్మాల ఇల్లు కనిపిస్తుంది. "ఈ ఇంటిని మా మావగారి తండ్రి పెద్దిరాజుగారు 1953లో కట్టించారండి. డబ్బులుంటే ఖర్చయిపోతాయి, అదే ఇల్లయితే ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆలోచించారట...'' అంటూ చెప్పుకొచ్చారు ఆ ఇంటి చిన్న కోడలు కృష్ణవేణి. ఆవిడ చెబుతున్న దాన్ని బట్టి ఆ ఇంటి నిర్మాణానికి ఏడాది సమయం పట్టింది. రోజుకు వంద మంది చొప్పున పనిచేశారు. "అప్పుడు చుట్టుపక్కల బాగా కరువుగా ఉండేదటండి.

ఎవరికీ పనుల్లేక అల్లాడిపోతుంటే మా మావగారు దీన్ని మొదలుపెట్టారని చెప్పుకోవడం విన్నాం. అందుకే రోజుకింతని కూలి డబ్బులు కాకుండా, పని చేసిన వారికి రెండు పూటలా భోజనాలు పెట్టేవారట ఆ రోజుల్లో. పెద్దాయన పద్ధతే వేరు. ఆయనకు పుణ్యకార్యాలంటే ఎంతో మక్కువ. మీకు తెలుసా..? మూడు తరాలుగా మా ఇంట్లో అందరూ శాకాహారులమే. మా పెళ్లి నాటికి ఇంటి నిర్మాణం పూర్తయింది. నూతన వధూవరులుగా మేమీ కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేశాం. మా తర్వాత బంధువుల పిల్లలవి, మా పిల్లలవీ అందరివీ పెళ్లిళ్లు ఈ ఇంట్లోనే అయ్యాయి. కళ్యాణ మండపాలని మేం బైటికి ఎక్కడికీ వెళ్లలేదు'' అని గుర్తు చేసుకున్నారు పెద్దకోడలు.

రంగుల హరివిల్లు...
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తులుగా ఉన్న ఈ ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చయిందని ఒక అంచనా. మొత్తం ముప్ఫై గదులు, పదిహేను హాళ్లు ఉన్నాయి. ప్రతి గదిలోనూ, వరండా మీదా మనకు నిలువెత్తు అద్దాలు కనిపిస్తాయి. హాళ్లన్నిటికీ నీలం రంగు, గదుల్లో ఎరుపు, లోపల వరండాలకు ఆకుపచ్చ రంగులో చేసిన గచ్చు వింత అందాన్నిస్తుంది. ప్రతి చోటా గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చేందుకు పెద్దపెద్ద కిటికీలతో పాటు పైకప్పులకు అద్దాలను ఏర్పాటు చేశారు. గుమ్మాలు, తలుపులు, ద్వారబంధాలు - అన్నీ బర్మా టేకుతో చేసినవే. ముఖద్వారంతో సహా గదుల తలుపులు, గుమ్మాలకు కనిపించే లతలు, రకరకాల డిజైన్లు ఆనాటి వడ్రంగుల హస్తకళా నైపుణ్యానికి సాక్షీభూతాలుగా కనిపిస్తాయి.

వెనకవైపు పెద్ద వంటిళ్లు, భోజనాల హాళ్లు, వాటిని ఆనుకునే తోట, అందులో బావి, వాటికి కాస్త పక్కగా పెంకులతో కట్టిన పశువుల కొట్టాలు, ఇంటిని ఆనుకునే కల్లం ఉంటుంది. అలాగే ఇంటి ముందు చల్లగా గాలి వీస్తూ, చక్కని నీడనిస్తూ కొబ్బరి తోట అలరిస్తుంది. 'సినిమా సెట్టింగులాగా ఉందీ ఇల్లు. షూటింగులేం జరగలేదా...' అనడిగితే "జరిగాయండీ, 'రెండురెళ్లు ఆరు' సినిమా షూటింగ్ కొంత చేశారిక్కడ. మాకా సినిమావాళ్ల హడావుడి, గోల పడలేదు. తర్వాత ఎవరొచ్చి అడిగినా మేం ఇవ్వలేదు. అప్పటివరకూ మా ముఖద్వారం ఎన్నడూ మూసి ఉండేదే కాదు. అలాంటిది ప్రచారం ఎక్కువయిపోయాక ఇంట్లో దొంగలు పడ్డారు.. దాంతో మేం జాగ్రత్త పడటం మొదలెట్టాం'' అంటూ చెప్పారు కృష్ణవేణి.

పండగొస్తే బాగుంటుంది...
మూడో తరంలోని మనవల్లో శ్రీపతిరాజు తప్ప ఇంకెవరూ అక్కడ ఉండటం లేదు. ఉద్యోగ, వ్యాపారాలు చదువుల్లో తలమునకలుగా ఉండి కొందరు విదేశాల్లోనూ మరికొందరు వివిధ ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. ఇప్పుడా ఇంట్లో ఉండేది నలుగురంటే నలుగురు పెద్దవాళ్లు. అయితే ఏడాదంతా ఎవరు ఎక్కడ ఉన్నా పంటల పండగ సంక్రాంతి నాటికి మాత్రం ఎక్కువమంది పూర్వీకుల ఇంటికి చేరుకుంటారు. "అందరూ వచ్చినప్పుడు చూడాలండీ సందడి. ఇంటికే కొత్త అందం వచ్చినట్టు, పండగంతా మా ఇంట్లోనే ఉన్నంత శోభగా ఉంటుంది'' అన్నారు శ్రీపతిరాజు. ఎప్పుడు ఏ మరమ్మత్తులు వచ్చినా వెంటనే చేయించి ఇంటిని జాగ్రత్తగా కాపాడుతున్నారాయన.

"ఎంత చేసినా చాలదు. ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర సమస్య వస్తూనే ఉంటుంది. ఒకప్పుడున్నన్ని పశువులు ఇప్పుడు లేవు. పైగా పెరటివైపు గోడ కాస్త పడిపోతోంది. పది మంది ఉన్నప్పటి దారి వేరు. అటు మనుషులు, ఇటు పాడిపంటలతో కళకళలాడిన ఇల్లు కదా, ఇప్పుడిలా చూడాలంటే కష్టంగానే ఉంటుంది...'' అన్నారు కృష్ణవేణి. ఇల్లు కట్టిన పెద్దిరాజుగారు లేరు, లేకలేక ఆయనకు కలిగిన కొడుకు లక్ష్మీపతిరాజు లేరు, ఆయన కొడుకులు అప్పలరాజు, పెద్దిరాజు కూడా లేరు. నూటొక్క గుమ్మాల ఇల్లు మాత్రం ఠీవిగా నిలబడి ఉంది - కాలం చెక్కిలి మీద తడి ఆరని ముద్దులా. ముద్దుగా.

పాలకులంతా మహిళలే...


గుడివాడ గ్రామానికి మరో విశేషమూ ఉంది. అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ మహిళలే! వార్డు సభ్యులు మొదలుకొని ప్రెసిడెంటు వరకూ మొత్తం పదిమందీ అతివలే. "ఎన్ని కులాలు, ఎన్ని ఆర్థిక తారతమ్యాలు ఉన్నా మేమంతా ఒకే మాట మీద ఉంటాం'' అన్నారు శ్రీపతిరాజు తల్లి కృష్ణవేణి. నూటొక్క గుమ్మాల ఇంటి చిన్న కోడలు. ఆవిడే గుడివాడ గ్రామ ప్రెసిడెంటు. ఆ ఐకమత్యం వల్లనేమో, ఊరు కూడా అభివృద్ధి ప«థంలో నడుస్తోంది.

నాబార్డు నిధులతో 29 లక్షల రూపాయలు ఖర్చు చేసి చక్కటి రోడ్డు వేసుకున్నారు. పాఠశాల, ఆసుపత్రి, బ్యాంకు వంటివన్నీ చక్కగా నడుస్తున్నాయి. బైర్రాజు ఫౌండేషన్ సాయంతో శుద్ధి చేసిన మంచినీరు అందరికీ అందుబాటులో ఉంది. యాభయ్యేళ్లుగా సర్పంచ్ పదవికి పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా సాగుతుండటం విశేషం. 
* అరుణ పప్పు, విశాఖపట్నం ఫోటోలు : వై. రామకృష్ణ

No comments: