
వీరాస్వామి, శేషాచల కవి తమ యాత్రలను తెలుగులోనే రాశారు. కాని సుబ్బారావు తన యాత్రానుభవాల్ని విడిగా కాకుండా తన స్వీయచరిత్రతో పాటుగా రాసుకున్నాడు. 'A life journey of v.soob row' అనే స్వీయచరిత్రని, తాను కాశీయాత్ర చేసిన 16 సంవత్సరాల తరువాత, తన జీవితపు చివరి సంవత్సరంలో ఇంగ్లీషులో రాసుకున్నాడు. ముద్రించుకుందామని కూడా ఆలోచించలేదు. యాత్ర పూర్తవ్వగానే ముద్రించివుంటే సుబ్బారావే తెలుగుయాత్రా సాహిత్యానికి ఆద్యుడు అయ్యేవాడు. ఇంగ్లీషులో ఉన్న ఆ పుస్తకాన్ని ఆయన కొడుకు గోపాలరావు 1873 సంవత్సరంలో అంటే 34 సంవత్సరాల తరువాత ముద్రించి బంధువులకు పంచిపెట్టాడు.
అప్పటికే వీరాస్వామి 'కాశీయాత్ర' రెండవ ముద్రణకు కూడా వచ్చింది. అ తరువాత 103 సంవత్సరాలకు 1976 వ సంవత్సరంలో అక్కిరాజు రమాపతిరావు ఆ ఇంగ్లీషు గ్రంథాన్ని 'వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర' అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేయటం జరిగింది. తె లుగుపాఠకులకి ఆ పుస్తకం దొరకటం ఇప్పటికీ కష్టమే. అందుకే ఆయన చేసిన యాత్రల వివరాల్ని, బాటసారుల కోసం ఆయన నిర్మించిన సత్రం చరిత్రనీ, విషాదభరితమైన ఆయన జీవిత గా««థనీ తెలుగువారికి తెలియజెప్పటం యాత్రికుడుగా నా బాధ్యత అనుకున్నాను.
వెన్నెలకంటి సుబ్బారావు జన్మస్థలం ఒంగోలు పక్కనే ఉన్న ఓగూరు గ్రామం. ఒంగోలులోనే చదువుకున్నాడు. 13 సంవత్సరాల వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ(1757-1857)వారి మిలిటరీ ఆఫీసులో గుమస్తాగా చేరి అంచెలంచెలుగా ఎదిగి, మద్రాసులోని సదర్ అదాలత్ కోర్టులో ట్రాన్స్‌లేటర్, ఇంటర్ ప్రెటర్ ఉద్యోగాన్ని (1815-1829) ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించిన సుబ్బారావు బహుభాషావేత్త. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది.

సుబ్బారావు జీవితంలో చాలా భాగం ప్రయాణాల్లోనే గడిచిపోయింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 55వ ఏట కన్నుమూసేవ రకూ, వివిధ సందర్భాల్లో ఆయన ప్రయాణాలు చేయవలసి వచ్చింది. ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం కొన్ని యాత్రలు చేస్తే భక్తికీ, బంధువులను పరామర్శించటానికీ చేసినవి మరికొన్ని.
1812 సంవత్సరం నాటికే ఆంధ్ర, కర్ణాటక అంతా తిరిగాడాయన ఉద్యోగరీత్యా. ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టగానే మరణం సమీపిస్తున్నట్లు ఊహించుకుని, 1822-23 సంవత్సరాల్లో మద్రాసు నుండి కాశీకి ప్రయాణం చేసి, 13 నెలల తరువాత క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నాడు. 1826వ సంవత్సరంలో రామేశ్వరానికి యాత్ర చేశాడు. కాశీనుండి తెచ్చిన గంగాజలంతో రామేశ్వరంలోని శివలింగాన్ని అభిషేకించటం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయాణంలో దక్షిణ భారతదేశ ంలో ఎక్కువ భాగాన్ని చూడగలుగుతాడు. ఇది మూడు నెలలపాటు జరిగిన సుదీర్ఘ యాత్ర. తన మూడవ భార్య కనకమ్మ మరణించాక, మనశ్శాంతి కోసం 1831వ సంవత్సరంలో కాళహస్తి, తిరుపతి పరిసరాల్లో పదిరోజులపాటు తిరిగాడు. 1832-33 సంవత్సరాల్లో 8 నెలలపాటు మరొకసారి దక్షిణభారతదేశంలో యాత్ర చేశాడు. చివరిగా 1837వ సంవత్సరంలో తెలిసిన మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకోవటానికి ఉత్తరాంధ్రజిల్లాల్లో పర్యటనలు చేశాడు.

ఎంతో ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకి వెళుతున్నా, తన ఆరోగ్యం మాత్రం ఎంతమాత్ర మూ మెరుగుపడలేదు. 1829 నాటికి శక్తి పూర్తిగా సన్నగిల్లిపోగా, ఆ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం తప్పనిసరి అవుతుంది. అప్పటికే వివిధ హోదాల్లో కంపెనీవారికి 28 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు సుబ్బారావు. అనారోగ్యంతో సొంత ఇంటికి దూరంగా ఉద్యోగం చేసేకంటే, ఆరోగ్యంగా ఇంటిపట్టునే ఉంటే మరికొంత కాలం జీవించవచ్చు అనే నిర్ణయం తీసుకున్నాడు. 1829 జులె ౖనెలలో మైలాపూర్‌లోని తన తోట, ఇల్లు అమ్మేసుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి, రూ. 140 పెన్షన్‌తో నెల్లూరులోని తన సొంత ఇంటికి చేరుకున్నాడు.
సొంత ఇంట్లో స్థిరంగా ఉందామనుకున్న ఆశ కూడా తాత్కాలికమే అవుతుంది. ఎలాగంటే 1831లో తన మూడవభార్య కనకమ్మ ఒక మగబిడ్డని కని అనారోగ్యంతో మరణిస్తుంది. తనతో 15 సంవత్సరాలుగా కాపురం చేసిన భార్య మరణంతో సుబ్బారావు ఎంతో కుంగిపోయాడు. '..so great was my grief occassioned by the unexpected death of my poor wife kanaka that i was for sometime cofined to my bed at nellore'' అని రాశాడు. కన్న కొడుకునూ, అప్పటికే తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని పోషించటం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవటం తప్పనిసరి అవుతుంది సుబ్బారావుకి. తన రోగం రోజురోజుకీ ముదిరిపోతూనే ఉంటుంది. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి సహాయం చేసే మనస్తత్వం ఉన్న సుబ్బారావు అప్పటికే తన ఆస్తిలో ఎక్కువభాగాన్ని చుట్టపక్కాలకి పంచిపెట్టేశాడు. తనకు వారసుణ్ణి ప్రసాదించిన కనకమ్మ స్మృతికోసం పదిమందికీ ఉపయోగపడే పనిచేద్దాం అనుకున్నాడు. అప్పటినుంచి ఆయన మనసు తేలికవటం మొదలవుతుంది.
రద్దీగా ఉండే రహదారిలో బాటసారులకోసం సత్రాన్ని నిర్మించాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. ధర్మశాలలు, ముసాఫిర్ ఖానాల విలువ, ఉపయోగం ఒక యాత్రికుడిగా ఆయనకి బాగాతెలుసు. "..,u desire to built a choultry on some highway for the accomodation of travellers of all nations..'' అనే ఆలోచనతో నెల్లూరు జిల్లాలోని రామాయపట్నానికీ, సింగరాయకొండకూ మధ్య ఉన్న రహదారిలో kanaka's choultry ( కనకమ్మ సత్రం) కట్టడానికి స్థలాన్ని సేకరించగలిగాడు. బాటసారి దేవోభవ అని నమ్మిన సుబ్బారావు, సత్రం నిర్మాణం కోసం ఆరునెలలపాటు అక్కడే ఉండి, 1832 సంవత్సరం నాటికి ఆ నిర్మాణం పూర్తి చేయగలుగుతాడు. ఆ తరువాత సంవత్సరం విడుదలైన మద్రాసు గెజెట్‌లో సత్రం గురించిన వివరాలు ఉన్నాయి. సత్రం పని అంతా పూర్తయ్యాక ప్రజలు, బాటసారులు సుబ్బారావు పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో మెలిగారు. వారు చూపుతున్న గౌరవానికి, ప్రేమకు ఉప్పొంగిపోయిన సుబ్బారావు ఆ సత్రంలో తాను కూడా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. గాలిమార్పు కోసం దేశమంతా తిరిగినా, చివరికి తన సత్రం పరిసరాలే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాయి సుబ్బారావుకి.
అప్పటినుండి కుటుంబసమేతంగా సత్రంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని, వివిధ భాషలు మాట్లాడే యాత్రికులతో స్నేహం చేస్తూ, సముద్రతీర సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పంటపొలాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన 55 సంవత్సరాల జీవితాన్ని చాలా విపులంగా గుర్తుకి తెచ్చుకుని ఆత్మకథ రాశాడు. ఆ తర్వాత మరో రెండు నెలలపాటు మాత్రమే ఆయన బాటసారులకి కనిపించాడు.
1839 అక్టోబరు 1వ తేదీన ఆయన ఇహలోక యాత్ర చాలించగానే, కనకమ్మ సత్రం పక్కనే సుబ్బారావుని సమాధి చేశారనీ, చాలా కాలంపాటు ఈ సత్రం, సమాధులపట్ల ప్రజలు భయభక్తుల్ని కనపరుస్తూ వచ్చారని తెలుసుకుని ఎంతో ఆనందించాను. అనువాదంతో పాటు ఇలాంటి ముఖ్యమైన వివరాల్ని అందించిన రమాపతిరావుని మనుసులోనే అభినందించాను.
సుబ్బారావు లాంటి విస్మృతయాత్రికుడు, సహృదయుడు నిర్మించిన ఆ కనకమ్మ సత్రం ఒంగోలు పక్కన ఉన్న మా చవటపాలెం (వయా అమ్మనబ్రోలు) గ్రామానికి దగ్గరే కాబట్టి చూద్దామని బయలుదేరాను. ఇప్పటికి 180 సంవత్సరాల నాడు నిర్మించిన ఆ సత్రం ఎలాంటి శిథిలావస్థకి చేరుకుని ఉంటుందో అనుకుంటూ బయల్దేరాను. ఎందుకంటే ఒంగోలు స్టేషనుకి ఎదురుగా ఉండే పొత్తూరి అయ్యన్నశెట్టి సత్రం నాకు బాగా తెలుసు. ఒకటిన్నర ఎకరాల వైశాల్యంలో నిర్మించిన రెండు అంతస్థు«ల మేడ అది. 1909వ సంవత్సరంలో కట్టిన ఆ సత్రం శిథిలమైపోయి పది సంవత్సరాలైంది. అలాంటపుడు 180 సంవత్సరాల నాటి కనకమ్మ సత్రం ఎలాంటి దశలో నాకు దర్శనమిస్తుందో అనుకున్నాను.
- ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ 98498 83570